Food Safety | సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ ) : కల్తీ వ్యవహారం గ్రేటర్‌ను కుదిపేస్తోంది. చిన్న హోటళ్లే కాదు పేరొందిన రెస్టారెంట్లలోనూ భయానక వాస్తవాలు రోజుకో చోట బయటపడుతున్నాయి. నియమ, నిబంధనలను పక్కన పెట్టేసి ధనార్జనే ధ్యేయంగా హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వాహకులు వ్యాపారాన్ని సాగిస్తున్నారు. వంట గదులు పరిశుభ్రత పాటించడం లేదు.. ఫుడ్ తయారీలో ప్రతిదీ కల్తీ వస్తువులను వాడుతున్నారు. పైగా పాచిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి తిరిగి వేడి చేసి పెడుతున్నారు. మాంసం అయితే రోజుల తరబడి ఫ్రిజ్‌లో పెట్టి దానికి మాసాలాలు దట్టించి మరుసటి రోజు వాడుతున్నారు.
బిర్యానీలో బొద్దింకలు, వెంట్రుకలు వస్తున్న సందర్భాలు లేకపోలేదు.. ఈ జాబితాలో చిన్న హోటళ్లు నుంచి బడా హోటళ్ల నిర్వాహకులు ఉంటున్నారు. తరచుగా జీహెచ్ఎంసీకి నిత్యం దాదాపు 20 వరకు పైగా ఫిర్యాదులు ఇలాంటివే ఎక్కువగా వస్తున్నాయి. ఇందులో భాగంగానే గడిచిన కొన్ని నెలలుగా ఫుడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ బృందాలు ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై విస్తృత తనిఖీల్లో ఆహార కల్తీకి అడ్డూ అదుపు లేకుండా పోతుందని , ఏ మాత్రం శుభ్రత, నాణ్యతల లేమి బయటపడుతున్నాయి. గడిచిన పది నెలల వ్యవధిలో 9,886 హోటళ్లలో తనిఖీలు చేయగా, 1588 వాటికి అధికారులు నోటీసులు జారీ చేశారు. 68 హోటళ్లు ప్రమాదకరం, 12 తీవ్ర హానికరమని తేల్చారు. ఆహార పదార్థాల్లో కల్తీకేదీ కాదు అనర్హం అన్న చందంగా ఈ తనిఖీలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా భారీ పెనాల్టీలు, మూసివేతలు, తగిన శిక్షణ అమలు కాకపోవడం ఓ కారణం కాగా, లంచాలకు మరిగిన అధికారులపై చర్యలు లేకపోవడంతో మరో కారణంగా కనిపిస్తున్నది.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
గ్రేటర్లో దాదాపు 12 నుంచి 14 వేల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ఆయిల్ నుంచి మొదలు ఉప్పు దాకా నాణ్యమైన వాటిని వినియోగించి నిర్వాహకులు క్వాలిటీ ఫుడ్‌ను అందించాలి. కానీ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం హోటళ్లు, హాస్టల్స్, క్యాంటీన్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, చైనీస్ ఫుడ్ సెంటర్లు..ఫుడ్ వ్యాపారం ఏదైనా.. నిర్వాహకులు వంటగది లోపలి భాగం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. డ్రైనేజీ వసతి బాగుండాలి.
అమలు కానీ కఠిన శిక్షలు
పరిరక్షణ లేని ఆహారాన్ని ఎవరు తయారు చేసినా, అమ్మినా, నిల్వ చేసినా, సరఫరా చేసినా ఫుడ్ సెఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ 2006 చట్టం ద్వారా శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. అనుమతి లేకుండా విక్రయిస్తే ఆరు నెలల జైలు, రూ. లక్ష వరకు జరిమానా వేస్తారు. ఆరోగ్యానికి హానికరంగా ఉంటే ఏడాది జైలు శిక్ష, రూ. 3 లక్షల వరకు పెనాల్టీ ఉంటుంది. తీవ్ర అనారోగ్యానికి గురి చేసే ఆహార పదార్థామైతే ఆరు నెలల జైలు శిక్ష, రూ. 5లక్షల వరకు జరిమానా వేస్తారు.
గడిచిన పది నెలల్లో జీహెచ్ఎంసీ ఫుడ్సేఫ్ట్టీ అధికారుల తనిఖీ వివరాలు
నిర్వహించిన తనిఖీలు : 9,886
జారీ చేసిన నోటీసులు : 1,588
సేకరించిన శాంపిల్స్ : 1,797
శాంపిల్స్ మేరకు ఉల్లంఘనులు: 68
సురక్షితం కానివి : 12
సర్వం కల్తీమయం