Adulterated Oil | మలక్ పేట, మార్చి 10: ఎక్కువ లాభాలు ఆర్జించాలన్న ఆశతో ఓ వ్యాపారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాడు. బ్రాండెడ్ ఆయిల్ కంపెనీల లేబుళ్లు(స్టిక్కర్లు) అతికించి కల్తీ నూనె విక్రయిస్తున్నాడు. సోమవారం నాడు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని మలక్‌పేట గంజ్‌లోని శ్రీ గణేశ్ బాలాజీ లక్డాతర్ ఆయిల్ దుకాణంలో కొంతకాలంగా బ్రాండెడ్ ఆయిల్ కంపెనీ లేబుళ్లు (స్టిక్కర్లు) అతికించి కల్తీ నూనెను విక్రయిస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న సౌత్ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం నాడు దుకాణంలో తనిఖీ చేశారు. ఆ సమయంలో పలువురు మహిళలు బాటిళ్లలో కల్తీ ఆయిల్‌ను నింపుతూ బ్రాండెడ్ కంపెనీల లేబుళ్లను అతికిస్తూ కనిపించారు. కల్తీ ఆయిల్‌తో పాటు బాటిళ్లు, ప్యాకెట్లు, ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్, ఫ్రెష్ హార్ట్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ పేరుతో ఉన్న లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు.