Cheap Liquor | సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ మద్యం డిపోల నుంచి మద్యం తీసుకోకుండా బార్‌ను ఎలా నిర్వహిస్తున్నారనే అనుమానంతో రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్ తన బృందంతో కలిసి గురువారం రాత్రి అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఉన్న ట్రూప్స్ బార్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఖరీదైన మద్యం బాటిళ్లలో చౌక ధర కలిగిన మద్యాన్ని కలుపుతున్న కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ, పునీత్ పట్నాయక్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నిర్వాహకులు ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు చెల్లించకపోవడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని వైన్ షాపుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అంతే కాకుండా ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్‌ను అనుమానం రాకుండా తీసి, అందులో నుంచి సగం మద్యాన్ని మరో సీసాలోకి నింపి, ఆ సగం సీసాలో నీరు, చౌక ధర గల మద్యాన్ని నింపుతున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో రూ.1.48 లక్షల విలువైన 75 కల్తీ మద్యం బాటిళ్లు, 55 ఖాళీ మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం బార్ యజమాని ఉదయ్‌కుమార్‌రెడ్డి, కల్తీ మద్యం తయారు చేసిన మేనేజర్ సత్యనారాయణ, బార్ ఉద్యోగి పునీత్ పట్నాయక్‌లపై కేసు నమోదు చేసి, షోకాజ్ నోటీసు జారీచేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ అధికారులకు అప్పగించారు. కాగా, ‘ట్రూప్స్ బార్’కు సంబంధించిన లైసెన్స్‌ను నిర్వాహకులు రెన్యువల్ సైతం చేయించుకోలేదు. అంతేకాకుండా మద్యం డిపోల నుంచి మద్యాన్ని కూడా తీసుకోకుండానే బార్‌ను మాత్రం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా బార్ లైసెన్స్‌ను రెన్యువల్ చేయించకపోవడమే కాకుండా కల్తీ మద్యం దందా నిర్వహిస్తున్న ట్రూప్స్ బార్ అండ్ రెస్టారెంట్ ఓ యూత్ కాంగ్రెస్ నాయకుడిదిగా ప్రచారం జరుగుతోంది.