Hyd Metro | మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. రెండోదశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం రూ.24,269 కోట్ల వ్యయంతో మెట్రో రెండో దశ పనులు చేపడుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండోదశ పనులు జరుగనున్నాయి. రెండోదశ నిర్మాణానికి రాష్ట్రవాటా రూ.7,313కోట్లు కేటాయించింది. కేంద్రం వాటా రూ.4,230కోట్లు. మెట్రో రెండోదశకు జైకా, ఏబీడీ, ఎన్న్డీబీ నిధులు రూ.11,693 కోట్లు, పీపీపీ పద్ధతిలో రూ.11033 కోట్లు ఖర్చు చేయనున్నారు.
మెట్రో రైలు రెండో దశ పార్ట్-ఏలో ఐదు కారిడార్లలో నిర్మాణం సాగనున్నది. కారిడార్-4లో నాగోలు నుంచి శంషాబాద్ వరకు 36.8 కిలోమీటర్లు, కారిడార్-5లో రాయదర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్లు, కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, కారిడార్ 7లో మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు 13.4 కిలోమీటర్లు, కారిడార్ 8లో ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7.1 కిలోమీటర్లు మెట్రో లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. రెండో దశలో పార్ట్-బీ కారిడార్ 9ని ప్రభుత్వం చేర్చింది. పార్ట్ బీలో కారిడార్-లో శంషాబాద్ నుంచి ఫ్యూచర్‌సిటీ వరకు నిర్మాణం జరుగనున్నది.