Gruha Jyothi | సిటీబ్యూరో, ఏప్రిల్14(నమస్తే తెలంగాణ): కాటేదాన్ వాసికి ఏప్రిల్నెల బిల్లు వచ్చింది. గత నెలలో గృహజ్యోతికింద వచ్చిన బిల్లు ఈనెలలో ఆ పథకం వర్తించలేదు. ఈనెల 4న మీటర్ రీడర్ బిల్లు తీశారు. 29 రోజులకు 199 యూనిట్లు వాడినట్లు ఉండగా మరో రెండురోజులకు 213 యూనిట్లు యావరేజ్ గా వేశారు. రూ.1206 బిల్లు వచ్చింది.
హబ్సిగూడకు చెందిన ఓ వ్యక్తికి గృహజ్యోతి బిల్లు వచ్చింది. 30 రోజులకు 196 యూనిట్లు వాడినట్లు ఉంది. ఇది మార్చి బిల్లు. ఆ నెలలో 31 రోజులకు సర్దుబాటు చేశారు. దీంతో సగటు నెల యూనిట్లు 203 అయ్యాయి. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడా పథకానికి నెమ్మదిగా వినియోగదారుల వాడకాన్ని చూపిస్తూ పథకం ప్రకారం లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తోంది.
గృహజ్యోతి పోయినట్లేనా..
గ్రేటర్ హైదరాబాద్లో గత సంవత్సరం నుంచి గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు మొదలయ్యాయి. ప్రస్తుతం 10,03286 మంది జీరో బిల్లు వాడుతున్నారని అధికారులు చెబుతున్నారు. వీరు ప్రతీనెలా 89.39 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు.
ఇదంతా వేసవికి ముందు ముచ్చట. ఇప్పుడా లెక్క మారింది. విద్యుత్ వినియోగం వేసవి కారణంగా విపరీతంగా పెరిగింది. అయితే ఇదే వినియోగదారులు సుమారు 110 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ వినియోగిస్తున్నట్లు అధికారులు లెక్క తేల్చారు. లోడ్ పెరిగిపోతున్నదని, భారం ఎక్కువ కావడంతో కరెంట్ కోతలు తప్పడం లేదని భావించిన ఉన్నతాధికారులు జీరో బిల్లులకు చెక్ పెడుతున్నారు. యావరేజ్ బిల్లుతో జీరో బిల్లు రాకుండా చేస్తున్నారు.
గృహజ్యోతి పథకంలో లేనివారికి కూడా ముందస్తు బిల్లు కొంత ఇబ్బందే అయినా వారిపై భారం వందల్లో ఉంటోంది. పథకం లబ్ధిపొందుతున్న వారికి జీరో బిల్లు బదులు వేలల్లో బిల్లులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. ముందస్తుగా వచ్చి బిల్లులు తీయడమే కాకుండా తాము బిల్లు కట్టకపోతే కరెంట్ కట్చేస్తామంటూ బెదిరిస్తున్నారని లబ్ధిదారులు వాపోయారు.
యావరేజ్ బిల్లుతో పథకం కట్..
ప్రతీనెలా మీటర్ రీడర్ ఇంటింటికీ వచ్చి కరెంట్ బిల్లులు జారీ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరికి 29 రోజులకు, మరికొందరికీ 32 రోజులు ఇలా వెనకా ముందూ బిల్లింగ్ జారీ చేస్తున్నారు. ఆలస్యంగా తీయడం ద్వారా స్లాబ్ మారి బిల్లులు అధికంగా వస్తున్నాయి. దీంతో కొన్నేళ్ల కిందట కాల్చిన యూనిట్ల ఆధారంగా కాకుండా నెల సగటు యూనిట్ల ఆధారంగాశ్లాబును నిర్ణయించే పద్ధతిని ప్రవేశపెట్టారు. మీటర్ రీడర్లు ఒక్కోసారి ఒకటి, రెండురోజుల ముందే బిల్లులు ఇస్తుంటారు.
ఉదాహరణకు మార్చిలో 29న అంటే రెండు రోజుల ముందుగానే నెల బిల్లింగ్ ఇచ్చారు. మిగతా రెండురోజులకు సగటు లెక్కన బిల్లు జారీ చేశారు. ఈ పద్ధతి గృహజ్యోతి లబ్ధిదారులకు అశనిపాతంలా మారింది. నిర్ణీత 200 యూనిట్లు దాటుతుండడంతో బిల్లు మోత మోగుతోంది.