సిటీ బ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : నా ఎదురుగానే కూర్చుంటవ్.. నాకు సహకరించవా.. నీ ఇష్టం.. సపోర్ట్ చేయకపోతే నెగెటివ్ రిపోర్ట్ రాస్తా.. ఒక్కసారి కమిట్ అయితే నీ ఇష్టం వచ్చినట్లు చేయి.. అంతా నేను చూసుకుంటా.. ఇది మింట్ కాంపౌండ్‌లో ఓ ఇంజినీర్ తోటి మహిళా ఉద్యోగిని వేధించిన తీరు.. దక్షిణ డిస్కం ప్రధాన కార్యాలయంలో ఆ కీచక ఉద్యోగి బాగోతమిది. తన విభాగంలో పనిచేసే ఓ మహిళా ఇంజినీర్‌ను సంవత్సర కాలంగా వేధించడమే కాకుండా ఇటీవల చాలా వికృతంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మింట్‌కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఐటీ విభాగమది.
అక్కడ నలభై మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. దక్షిణ డిస్కంకు సంబంధించి ఐటీ నిర్వహణ మొత్తం అక్కడి నుంచే జరుగుతుంది. దీనికి ఒక సీజీఎం, ఎస్ఈ, డీఈ, ఏడీఈలు, ఏఈ ఉన్నారు. వీరిలో ఎస్టిమేట్స్, బడ్జెట్స్ ఒక ఏడీఈ నిర్వహిస్తుంటే మరొకరు ఆపరేషన్స్ చూస్తారు. ఏఈలు వీరికి సహాయంగా పనులు చేస్తున్నారు. కార్యాలయంలో తన చాంబర్ ఎదురుగానే కూర్చున్న ఏఈపై ఆ ఏడీఈ కన్ను పడింది. కొంత కాలంగా ఆమెను ఏదో ఒకరకంగా వేధిస్తున్నప్పటికీ డైరెక్ట్‌గా చెప్పకుండా పరోక్షంగా వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఆమె దారికి రాకపోవడంతో ఒకరోజు నేరుగా చాంబర్లోకి పిలిచి తనతో కమిట్ కావాలని అడిగినట్లు సమాచారం.
ఈ విషయం బయటకు పొక్కితే తనకెక్కడ ఇబ్బంది జరుగుతుందోనని బాధితురాలు కొంతకాలం ఆగినప్పటికీ అతడి వేధింపులు మితిమీరిపోయాయి. ఒకదశలో ఆమె పనితీరుపై నెగెటివ్ రిపోర్ట్ ఇస్తానని, అవసరమైతే ఎంతదూరమైనా వెళ్తానంటూ బెదిరించాడు. అంతేకాకుండా ఆమెపై లైంగికవేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంలో బాధితురాలు చాలా సహనం వహించి చివరకు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సీఎండీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో బాధితురాలు తనకు ఎదురైన అనుభవంపై బయటపడలేక ఇబ్బంది పడుతుంటే లైంగికవేధింపులకు పాల్పడిన ఆ అధికారి మాత్రం ముందుగా సెలవు పెట్టి ఆపై ప్రశాంతంగా సిద్దిపేటకు బదిలీపై వెళ్లారు.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని కోర్టుకు పంపించారు. అదేరోజు బెయిల్ రావడంతో ఆ ఏడీఈ ఎలాంటి శిక్ష లేకుండా నవ్వుతూ బయటకు వచ్చారు. ఈ విషయంలో పోలీసు అధికారులు మాత్రం బాధితురాలికి జరిగిన అన్యాయంపై తీవ్రంగా స్పందించి ఈ విషయం బయటకు పొక్కకుండా చూస్తూనే ఆ ఏడీఈపై చర్యలు తీసుకోవాలంటూ సీఎండీకి సిఫారసు చేశారు. ఒకవైపు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూనే సీఎండీ ముషారఫ్ ఫరూఖికి కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. అతడు వ్యవహరిస్తున్న తీరు, తనను ఎలా వేధిస్తున్నారో చెప్పి చర్యలు తీసుకోవాలని, తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు.
కానీ ఈ ఫిర్యాదుపై ఓ డైరెక్టర్ జోక్యంతో బాధితురాలికి న్యాయం జరగకపోగా ఆ కీచక ఉద్యోగి సెలవుపై వెళ్లాడు. ఆ డైరెక్టర్ తనకు అత్యంత దగ్గరైన ఆ ఏడీఈకి అండగా నిలిచి బాధితురాలైన మహిళా ఉద్యోగితో రాజీ కుదురుస్తానని సీఎండీ సమక్షంలో చెప్పి ఆయనకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేసినట్లు సమాచారం. ఆ సమయంలో సీఎండీ ఆ కీచక ఉద్యోగిపై చర్యల విషయంలో డైరెక్టర్ జోక్యాన్ని సమర్థిస్తూనే విషయం తొందరగా తేల్చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. డైరెక్టర్ సూచనల మేరకు ఆ ఏడీఈ సెలవుపై వెళ్లిపోయిన కొన్ని రోజులకే అతడికి తిరిగి సిద్దిపేటలో పోస్టింగ్ ఇస్తూ ఆ డైరెక్టర్ పైరవీతో ఉత్తర్వులు ఇచ్చారు. అంతే కాకుండా తిరిగి అతడిని త్వరలోనే మింట్ కాంపౌండ్‌కే తీసుకొస్తానని, అతడి అవసరం ఆ సెక్షన్లో చాలా ఉందంటూ సహ ఉద్యోగుల దగ్గర డైరెక్టర్ అన్నట్లు తెలిసింది.
డైరెక్టర్ తన పరిధిలో ఉన్న రెండు అధికారాలను దుర్వినియోగం చేసి.. చేసిన పనితో ఆ ఉద్యోగి ఎలాంటి చర్యలు లేకుండా ఒక్క మెమో కూడా అందుకోకుండా బయటపడ్డారంటే ఎంత మేరకు లావాదేవీలు జరిగాయో, ఎన్ని డబ్బులు చేతులు మారాయోనంటూ ఆ విభాగం ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఎస్పీడీసీఎల్ కీలకమైన ఐటీ విభాగంలో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగికి భద్రత కల్పించడంలో సంస్థ యాజమాన్యం విఫలమైందని, బాధ్యులైన ఉద్యోగిపై చర్యలు తీసుకోకుండా కనీసం మెమో కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన ఉన్నతాధికారుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ శాఖాపరమైన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్‌లో ఎవరూ మహిళా ఉద్యోగుల పై అసభ్యంగా ప్రవర్తించనే అభిప్రాయం మింట్‌కాంపౌండ్‌లో వ్యక్తమవుతుంది.