Hyderabad | కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 12: బెట్టింగ్‌లకు పాల్పడిన ఓ వ్యక్తి ఆర్థికంగా నష్టపోయాడు. ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కూడా అతడిని మరింత ఇబ్బందికి గురి చేసింది. దీంతో జీవితంపై విరక్తితో అతడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్ బషీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లాకు చెందిన కమ్మరి మహిపాల్ (39) కొద్ది రోజుల కిందట తన భార్యతో కలిసి నగరానికి వలసొచ్చి కుత్బుల్లాపూర్‌లోని భాగ్యలక్ష్మి కాలనీలో ఉంటున్నాడు. వృత్తిరీత్యా ప్రైవేట్ టీచర్. అతడి భార్య ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నది. మహిపాల్ బెట్టింగ్‌కు బానిసయ్యాడు.
ఇటీవల తాను ఉంటున్న ప్రాంతం నుంచి స్కూటీపై వెళ్తూ ఓ నాలుగేళ్ల బాలుడిని ఢీ కొట్టాడు. బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. భయాందోళనకు గురైన అతడు తన సొంతూరుకు వెళ్లాడు. బాలుడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని, సమస్యను పరిష్కరించుకునేందుకు తిరిగి వచ్చాడు. అప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అతడిని.. బాలుడి విషయం తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. గురువారం సాయంత్రం అతడి భార్య ఆఫీస్‌కు వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.