Addagutta | అడ్డగుట్ట, మార్చి 12 : జిహెచ్ఎంసి అధికారుల నిఘా లోపం, నిర్లక్ష్యం కారణంగా లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన సామాజిక భవనం ప్రజలకు అందుబాటులో ఉన్నా.. లేనట్టుగానే… తయారైంది. అడ్డగుట్ట శాంతినగర్‌లోని కమ్యూనిటీ హాల్ లక్షల రూపాయలు వెచ్చించి బీఆర్ఎస్ ప్రభుత్వహయాంలో పేద, మధ్యతరగతి ప్రజలు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు వీలుగా నిర్మించడం జరిగింది. నిర్మించడంతోనే చేతులు దులుపుకున్న జిహెచ్ఎంసి అధికారులు ప్రస్తుతం సదరు కమ్యూనిటీ హాల్లో సరైన వసతులు లేక నిరుపయోగంగా మారిన ఏ మాత్రం పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. నిర్మాణం పూర్తయిన తొలిదశ నుండే అధికారులు ఈ భవనంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వెరసి కమ్యూనిటి హాల్ అందుబాటులో ఉన్న ఇలాంటి శుభకార్యాలను పూర్తిస్థాయిలో నిర్వహించుకునేందుకు వీలు లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శాంతినగర్ కమ్యూనిటీ హాల్ లో పూర్తిస్థాయిలో అందులో వసతులను కల్పించకపోవడంతో శుభకార్యాలను నిర్వహించుకోలేకపోతున్నామని స్థానిక ప్రజలు చెప్పుకొస్తున్నారు. కరెంటు సరఫరా లేక నెలలు గడుస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని, బోర్ పాడై నిరుపయోగంగా ఉన్నం కనిసం ఉపయోగంలోకి తీసుకురావడానికి ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వసతులు లేక డబ్బులు వెచ్చించి వేరే చోట శుభకార్యాలను నిర్వహించుకోవాల్సి వస్తుందని, వసతులు లేక కమ్యూనిటీ హాల్ ఉన్నా…లేనట్టుగానే… పరిస్థితి మారిందని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు నిర్వహణ మరువడంతో కమ్యూనిటీ హాల్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుందని పలువురు వాపోతున్నారు. కరెంటు సరఫరా లేక చాలావరకు ప్రజలు మధ్యాహ్నం సమయంలో నిర్వహించుకుంటున్నారని, రాత్రి సమయంలో కరెంటు లేకపోవడంతో శుభకార్యాలు నిర్వహించుకోవడానికి వీలు లేకుండా పోతుందని వారు చెక్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కమిటీ హాల్లో పూర్తిస్థాయి వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని శాంతినగర్ వాసులు కోరుతున్నారు.