పహాడీషరీఫ్ : ఎడతెరపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. భారీవర్షాలకు జల్పల్లి చెరువులోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో చెరువు పూర్తిగా నిండింది. ఈ క్రమంలో ఆమె మంగళవారం చెరువును పరిశీలించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ చెరువువద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు.
రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖ సమన్వయంతో పని చేసి సమస్యలు రాకుండా చూడలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో చెరువులు ప్రమాదకర స్థితికి చేరడంతో దిగువ ప్రాంతాలలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయలన్నారు. ముంపు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. భవిష్యత్లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జి.పి కుమార్, మేనేజర్ క్రాంతికుమార్, జల్పల్లి కో – ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్ కెంచె లక్ష్మీనారాయణ, శంషోద్దీన్, టీఆర్ఎస్ నాయకులు యంజాల జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.