సిటీబ్యూరో, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో వాణిజ్య వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని తెలితే సంబంధిత వాణిజ్య సముదాన్ని సీజ్ చేస్తామని, ఇప్పటికే జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం అడిషనల్ కమిషనర్ ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. ఆసుపత్రులు, సూపర్ మార్కెట్లు, మాల్స్, థియేటర్స్, కోచింగ్ సెంటర్లకు సంబంధించి ప్రతి యాజమాని ఫైర్ రూల్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగానే భద్రతా చర్యలు పాటించని 90 బిల్డింగులకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో వ్యాపార సంస్థలపై దృష్టి సారించారు. అగ్ని ప్రమాద నివారణలో అగ్నిమాపక యంత్రాలు, పొగను కనిపెట్టే (స్మోక్ డిటెక్టర్స్) యంత్రాలు ఏర్పాటు చేసిన తర్వాత భద్రత తగ్గింపు ప్రమాణ పత్రాన్ని పొందడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు జీహెచ్ఎంసీ ఈవీడీఎం www.firesafety.ghmc.gov.in వెబ్సైట్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నది. అగ్ని ప్రమాదాల తగ్గింపు/భద్రతా సర్టిఫికెట్ జారీ చేసేందుకు వెబ్ అప్లికేషన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి భద్రతా తగ్గింపు సర్టిఫికెట్లను అందజేస్తున్నారు.