Padmarao Goud | సికింద్రాబాద్, జూన్3: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యకలాపాల సమీక్షా సమావేశం మంగళవారం సీతాఫల్ మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. వర్షా కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బక్రీద్ పర్వ దిన ఏర్పాట్లు, స్కూళ్ల రీఓపెన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టాక్స్, హౌసింగ్ సమస్యలు, ఇతరత్రా అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఎదురుకావడం శోచనీయమని తెలిపారు. నిధుల కేటాయింపుతో నిమిత్తం లేని అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నాలా పూడిక తీసివేతను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని మునిసిపల్ డివిజన్లలో అత్యవసర బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అపాయకరంగా నిలిచిన విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని, వివిధ ప్రదేశాల్లో చెట్ల కొమ్మల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా వాటిని తొలగించాలన్నారు. అడ్డగుట్ట, లాలాపేట, ఎరుకల బస్తీ ఫంక్షన్ హాల్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని, స్విమింగ్ పూల్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
లాలాపేటలో రోడ్డు విస్తరణను పూర్తి చేసినప్పటికీ స్తంభాల తొలగింపు, ఇతరత్రా పనులు చేపట్టని కారణంగా విస్తరించిన ప్రయోజనం నెరవేరడం లేదని పద్మారావు గౌడ్ తెలిపారు. చంద్రబాబు నగర్, పాండవ బస్తీ, శాస్త్రి నగర్, లంబాడి బస్తీ, మంగర్ బస్తీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఇళ్ళు శిధిలావస్థకు చేరిన పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్షంగా వ్యవహరించడం తగదని అన్నారు. సుబాష్ చంద్రబోస్ నగర్, దోభీ ఘాట్ లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపు వెంటనే పూర్తి చేయాలని, సాయి నగర్ లో నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం అర్హులైన దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. మేడి బావి నివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. కొత్త వార్డు కార్యాలయం నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని, ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ పునర్నిర్మాణం, లాలాగూడ లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌కు విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని సూచించారు.
ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు అంశంలో త్వరితగతిన ఏర్పాట్లు జరపాలని, శాస్త్రి నగర్ లో రుద్ర వీణ సంస్థ అభ్యర్థనకు అనుగుణంగా కమ్యూనిటీ హాల్, సేవ లాల్ మహారాజ్ భవనం నిర్మాణానికి ఏర్పాట్లు జరపాలని కోరారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల అధికారులు ప్రజలకు అందుబాటులో నిలవాలని పద్మారావు గౌడ్ సూచించారు. వివిధ విభాగాల మధ్య తమ కార్యాలయం ద్వారా నిర్వహించే సమన్వయ వాట్సాప్ గ్రూప్ సందేశాలకు వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు.
డిప్యూటీ కమీషనర్ సుభాష్ రావు.. మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పరిధిలో అభివృద్ధి కార్యకలాపాలు వేగంగా జరుగుతున్నాయని, అన్ని విభాగాల మధ్య సమన్వయం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎస్ఈ ఆశాలత మాట్లాడుతూ.. వర్షా కాలంలో ఎటు వంటి సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నామన్నారు. నిధుల కేటాయింపునకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.