ఖైరతాబాద్, మే 4 : ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ పైసా పైసా కూడబెట్టి ప్లాట్లు కొనుగోలు చేస్తే విక్రయించిన బిల్డర్లే కబ్జాకు యత్నిస్తున్నారని బాధితులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివోమ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కంబాలిపాటి హరిబాబు బాధితులతో కలిసి మాట్లాడారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల మండలం, కుత్బుల్లాపూర్ గ్రామంలోని సర్వే నం. 18, 19లోని మొత్తం 3 ఎకరాల 35 గుంటల్లో శివోమ్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ జీహెచ్ఎంసీ ఆమోదం పొందిన లేఔట్లలో 45 ప్లాట్లను విక్రయానికి పెట్టిందన్నారు.
2017లో 40 ప్లాట్లను తాము కొనుగోలు చేయగా, మిగిలిన ఐదు ప్లాట్లను జీహెచ్ఎంసీకి మార్టిగేజ్ చేశారన్నారు. శివోమ్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసుకపాట్ల సాంబమూర్తి, డైరెక్టర్లు వీఎస్ఎన్ రాజు, పి. బోసురాజు, చిలుకూరి నరేశ్‌లు కొనుగోలు సమయంలో ఈ ప్లాట్లను పూర్తిగా అభివృద్ధి చేసి అప్పగిస్తామన్నారని తెలిపారు.కానీ ఎనిమిది ఏండ్లుగా అభివృద్ధి చేయకుండా కాలయాపన చేశారన్నారు. పైగా జీహెచ్ఎంసీకి మార్టిగేజ్ చేసిన ప్లాట్లను సైతం విక్రయించి డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు.
తమ ప్లాట్ల పక్కనే ఉన్న లేఔట్లకు సంబంధించిన వారితో కుమ్మక్కై కావాలనే అభివృద్ధి చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై 40 మంది ప్లాట్ల ఓనర్లు నిలదీస్తే వారిపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. కనీసం తమ ప్లాట్లలోకి రానివ్వకుండా నిత్యం అక్కడ గుండాలతో పహారా పెట్టిస్తున్నారన్నారు. తమ ప్లాట్లను సైతం కబ్జా చేసి తిరిగి విక్రయానికి పెట్టేందుకు కుట్రలు జేస్తున్నారన్నారు. ఏపీలోని గత అధికార పార్టీకి చెందిన నాయకులతో వారికి సంబంధాలు ఉన్నాయని, అది అడ్డుపెట్టుకొని ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేసి ప్లాట్లను యజమానులకు అప్పగించాలని కోరారు. ఈ సమావేశంలో రాధాకృష్ణ, సంతోషి దీపిక, సునీత, రాజమౌళి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.