RTA | సిటీబ్యూరో,ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పరిధిలో రోడ్డు నిబంధనలు పాటించకుండా బండి నడిపిన వారిపై వేటు పడనుంది. వారి లైసెన్స్‌లు రద్దు కానున్నాయి. రవాణాశాఖ(ఆర్టీఏ) ఈ మేరకు రద్దు ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించింది. ట్రాఫిక్ పోలీసుల నుంచి వచ్చే డ్రైవింగ్ లైసెన్స్‌ల రద్దు ప్రక్రియను పర్యవేక్షించి.. త్వరితగతిన వాటిపై నిర్ణయం తీసుకోనున్నారు. రద్దు ప్రక్రియ న్యాయ నిబంధనలకు అనుగుణంగా చేయాల్సి ఉంటుంది.
అందుకోసం కొంత సమయం పడుతుందని ఉన్నతాధికారులు చెప్పారు. ఇప్పటికే గ్రేటర్లో లైసెన్స్‌ల రద్దును అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఏడాది ( మూడు నెలల్లో) ఇప్పటివరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో 820 డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేశారు. గ్రేటర్‌లోని వివిధ పోలీసు స్టేషన్ల నుంచి లైసెన్స్‌ల రద్దు కోరుతూ వచ్చిన అనేక పిటిషన్లు ఆర్టీఏ అధికారుల వద్ద పరిశీలనకు ఉన్నాయి. సుమారు 1700 లైసెన్స్‌ల రద్దుకు ప్రతిపాదనలు వచ్చాయి.
తొలుత నోటీసులు.. ఆపై లైసెన్స్ రద్దు
నిబంధనల ప్రకారం తొలిసారి డ్రంకెన్ డ్రైవ్ పట్టుపడితే 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తున్నారు. రెండోసారి దొరికితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. అంతేకాదు మోటారు వాహనాల సవరణ చట్టం-2019 సెక్షన్ 206(4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే కూడా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేసే వీలు ఉంది. అతివేగం, ఓవర్‌లోడ్, మరణాలకు కారణమయ్యే యాక్సిడెంట్లు చేయడం,
సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయడం తదితర వాటిలో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుంది.
పోలీసుల నుంచి ఉల్లంఘనదారుడి వివరాలు రవాణాశాఖకు చేరుకుంటాయి. వారు పరిశీలించి సదరు వ్యక్తికి నోటీసులు పంపిస్తారు. పది రోజుల్లో అతడు తన వివరణను ఇస్తాడు. అనంతరం రవాణ శాఖ అధికారుల నిర్ణయం మేరకు లైసెన్స్ రద్దు ప్రక్రియ జరుగుతుంది. కోర్టు నిబంధనల ప్రకారం వాహనదారుడికి నోటీసులు పంపకుండా లైసెన్స్ రద్దు చేయడం కుదరదు. అందులో భాగంగానే ఈ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుందని అధికారులు తెలిపారు.
క్రమశిక్షణ పాటిద్దాం..
రోడ్డు ప్రమాదాలు, నిబంధనలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయినా కొంతమంది ర్యాష్ డ్రైవింగ్, అతివేగంతో ఇతరుల ప్రాణాలను బలిగొంటున్నారు. కుటుంబ సభ్యులకు తీరని వ్యథను మిగులుస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్‌ల్లో చాలామంది పట్టుబడుతున్నారు. ఇలా నిబంధనలు అతిక్రమించే వారి సంఖ్య పెరగుతుండటంతో రవాణా శాఖ అధికారులు రద్దు ప్రక్రియను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తరుచూ ప్రమాదాలకు కారణమయ్యే వారి లైసెన్స్‌లు శాశ్వతంగా రద్దు చేస్తున్నారు. అందుకే వాహనదారులూ జర భద్రం.