Hyderabad | మన్సూరాబాద్, మార్చి 21: హైదరాబాద్‌లోని నాగోలు, ఎల్బీనగర్ పరిధిలో హుక్కా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిపిన ఈ దాడుల్లో మొత్తం 37 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా హుక్కా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో ఉన్న శెహరి కేఫె హుక్కా సెంటర్ పై ఏసీపీ కృష్ణయ్య తన బృందంతో కలిసి ఆకస్మిక దాడి చేశారు. స్థానిక సీఐకి కూడా సమాచారం లేకుండా స్వయంగా ఏసీపీనే రంగంలోకి దిగి తనిఖీలు జరపడం గమనార్హం. ఈ క్రమంలో అక్కడ హుక్కా సేవిస్తున్న 25 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి భారీగా హుక్కా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎల్బీనగర్లోని ఎల్వీసీ హుక్కా సెంటర్లోనూ తనిఖీలు నిర్వహించారు. అక్కడ 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణయ్య మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న యువకుల నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించినట్లు తెలిపారు. రిపోర్టుల ఆధారంగా వారిపై తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినా, నిబంధనలు ఉల్లంఘించి హుక్కా సెంటర్లు నడిపినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.