సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కూకట్పల్లి ఠాణా పరిధిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో ఎట్టకేలకు ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు, 16 వాచ్‌లు, రోల్డ్‌గోల్డ్ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సీపీ మహంతి కేసు పూర్వాపరాలు వెల్లడించారు.
జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన రోషన్ కొంత కాలంగా కూకట్‌పల్లిలోని స్వాన్లేక్ అపార్ట్మెంట్ 14వ అంతస్తులో ఉన్న ఒక వ్యాపారి ఇంట్లో పనిచేస్తున్నాడు. చాలా కాలంగా నమ్మకంగా పనిచేస్తుండడంతో 13వ అంతస్తులో నివాసముండే స్టీల్ వ్యాపారి రాకేశ్‌కుమార్ భార్య రేణుక అగర్వాల్ తన ఇంట్లో పనిచేయడానికి ఓ వ్యక్తి కావాలని రోషన్‌ను కోరింది. దీంతో రోషన్ స్వరాష్ర్టానికి చెందిన తన స్నేహితుడు హర్షను రేణు అగర్వాల్ ఇంట్లో 10రోజుల కిందట పనికి కుదిర్చాడు. ఈ క్రమంలో రేణు అగర్వాల్ ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు నగలు, డబ్బు, వాచీలు, ఇతర ఖరీదైన వస్తువులు ఉండడాన్ని హర్ష గమనించాడు.
ప్రతి రోజూ రేణు భర్త, కుమారుడు వ్యాపార రీత్యా బయటకు వెళ్తుండటంతో ఇంట్లో యజమానురాలు ఒంటరిగానే ఉండడాన్ని గమనించారు. దీనిని అదునుగా చేసుకొని సులభంగా ఇంట్లో నుంచి ఆభరణాలను దొంగిలించవచ్చని భావించిన హర్ష..తన పథకాన్ని రోషన్‌కు వివరించాడు. దీనికి రోషన్ కూడా అంగీకరించడంతో ఈనెల 8న దొంగతనానికి స్కెచ్‌వేసి, 9న యజమానురాలి ఇంట్లో ఎలా దొంగతనం చేసి.. తప్పించుకోవాలో రెక్కీ నిర్వహించారు. పథకం ప్రకారం ఈనెల 10న రేణు అగర్వాల్ భర్త, కుమారుడు బయటకు వెళ్లినట్లు నిర్ధారించుకున్న రోషన్, హర్ష..యజమానురాలి ఇంట్లోకి చొరబడ్డారు. అడ్డు వచ్చిన రేణు అగర్వాల్‌ను కట్టేసి, ప్రెషర్ కుక్కర్‌తో తలపై బలంగా కొట్టి దారుణంగా హత్య చేశారు. అనంతరం బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును దోచుకుని పరారయ్యారు.
హత్యకు పాల్పడిన నిందితులు రైలు మార్గంలో తమ స్వరాష్ర్టానికి పారిపోవాలని పథకం పన్నారు. ఈ క్రమంలో హత్య చేసిన తరువాత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకొని.. అక్కడి నుంచి జార్ఖండ్ వెళ్లేందుకు టికెట్లు సైతం కొనుగోలు చేశారు. కానీ అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు కనిపించడంతో భయపడి హఫీజ్‌పేటకు వెళ్లారు. అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని రాత్రి ఒంటి గంటకు హఫీజ్ పేట్ నుంచి క్యాబ్‌లో బయలుదేరి ఉదయం తొమ్మిది గంటలకు రాంచీ చేరుకున్నారు.
నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన రేణు అగర్వాల్ హత్యకు సంబంధించిన వార్తలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది గమనించిన క్యాబ్ డ్రైవర్ షాక్‌కు గురయ్యాడు. తాను డ్రాప్ చేసింది హంతకులను అని తెలుసుకొని విషయాన్ని వెంటనే తన ట్రావెల్ యజమానికి తెలిపాడు. ట్రావెల్ యజమాని విషయాన్ని పోలీసులకు తెల్పడంతో అప్పటికే రంగంలోకి దిగిన నాలుగు పోలీసు బృందాల్లోని రెండు బృందాలు క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు జార్ఖండ్ వెళ్లాయి.
అక్కడ దర్యాప్తు జరిపి, స్థానిక పోలీసుల సహకారంతో హత్యకు పాల్పడిన రోషన్, హర్షలతో పాటు దొంగ సొత్తును దాచిపెట్టిన రోషన్ సోదరుడిని సైతం గురువారం రాత్రి అరెస్టు చేసి, నగరానికి తరలించారు. రేణు ఇంట్లో పెద్ద ఎత్తున కనిపించిన రోల్డ్‌గోల్డ్ ఆభరణాలన్నీ బంగారు ఆభరణాలుగా భావించి దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో కూడా రోషన్ డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు సీపీ మహంతి వివరించారు. 2023లో రోషన్‌పై రాంచీలో మూడు కేసులు నమోదై ఉన్నట్లు సీపీ వెల్లడించారు.