60 కేంద్రాలను ప్రతిపాదించిన సంక్షేమ శాఖ
మేడ్చల్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా ప్రతిపాదించిన అంగన్వాడీ కేంద్రాలు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో నూతనంగా 60 అంగన్వాడీ కేంద్రాలతో పాటు 30 క్రష్ (బేబీకేర్) కేంద్రాల ఏర్పాటు కోసం సంక్షేమ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అయితే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేయలేదు.
స్లమ్స్ ఏరియాలతో పాటు వెనుకబడిన ప్రాంతాలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలు నివసించే బస్తీలు , గ్రామాలు, వాడల్లో అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత ఉపయోగపడే అవకాశం ఉన్న నేపథ్యంలో సంక్షేమ శాఖ చర్యలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. అలాగే అనువైన అంగన్వాడీ కేంద్రాల్లో నూతనంగా క్రష్ (బేబీకేర్) సెంటర్లను ఏర్పాటు చేసేలా సంక్షేమ శాఖ చర్యలు చేపడుతున్నది. జిల్లాలోని సొంత భవనంలో విశాలమైన అంగన్వాడీ కేంద్రాల్లో క్రష్ సెంటర్లను ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.
మేడ్చల్ జిల్లాలో ప్రస్తుతానికి 793 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో మొత్తంగా 1,07,484 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ లబ్ధిదారుల్లో 0-6 ఏండ్ల చిన్నపిల్లలు 90,361 మంది ఉండగా గర్భిణులు, బాలింతలు 17,123 మంది ఉన్నారు. అయితే మరిన్ని నూతనంగా అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటైతే మరింత మంది పేద ప్రజలకు ఉపయోగపడుతాయి.
జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో సంక్షేమశాఖ సర్వే నిర్వహించగా, మరిన్ని అంగన్వాడీ కేంద్రాలతో పాటు క్రష్(బేబీకేర్) సెంటర్ల అవసరం ఉందని సర్వేలో తెలినట్లు అధికారులు తెలిపారు. పేద ప్రజలకు మరింత సేవలను పెంచేందుకు అంగన్వాడీ కేంద్రాలతో పాటు క్రష్ సెంటర్లను ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు వెల్లడించారు.