CCS | సిటీబ్యూరో: ఆర్థిక నేరాలు జరిగితే హైదరాబాద్ సీసీఎస్‌కు వెళ్తే తమకు పక్కాగా న్యాయం జరుగుతుందనే భావన గతంలో ప్రజల్లో ఉండేది. నేడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అవినీతి, అక్రమాలు సీసీఎస్‌లో రాజ్యమేలుతున్నాయి. ఫిర్యాదు దారులు, నిందితులు ఎవరైనా సరే.. అక్కడ లంచం ఇచ్చుకోవాల్సిందేనన్న ఆరోపణలు ఇప్పుడు బలంగా వినిస్తున్నాయి. సెంట్రల్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ దాడులు వరుసగా జరగడంతో నగర పోలీస్ ఉన్నతాధికారులు కూడా అప్రమత్తమయ్యారు. సీసీఎస్ ప్రక్షాళన మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే నగర పోలీస్ కమిషనర్ 12 మంది సీఐలను మల్టీజోన్-2కు సరెండర్ చేశారు. అలాగే నలుగురు ఎస్ఐలను కూడా సరేండర్ చేసినట్లు సమాచారం.
అంతేకాకుడా ఛత్రినాక, మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ తదితర పోలీస్స్టేషన్లపై నిఘా పెట్టినట్లు తెలిసింది. ఇదిలాఉంటే ఇటీవల టీమ్-7 ఇన్స్పెక్టర్ సుధాకర్ ఓ కేసును క్లోజ్ చేసేందుకు రూ. 15 లక్షలు లంచంగా బాధితుల వద్ద డిమాండ్ చేశాడు. అడ్వాన్స్‌గా రూ. 5 లక్షలు తీసుకొని, మిగతా డబ్బుల కోసం బాధితుడిపై ఒత్తిడి తెచ్చాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో రూ. 3 లక్షల లంచం డబ్బులు తీసుకుంటూ..ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఇలా సీసీఎస్ అంతా అవినీతి కంపు కొడుతున్నది. ప్రక్షాళన చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కాగా, సీసీఎస్‌లో నమోదయ్యే చాలా కేసుల్లో 41 సీఆర్పీసీ నోటీసులు నిందితులకు ఇస్తుంటారు. నోటీసులు ఇచ్చేందుకు కొందరు పోలీసు అధికారులు లక్ష రూపాయల నుంచి రూ. 5 లక్షలకుపైగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.