Khairatabad | ఖైరతాబాద్, జూన్ 11 : ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇలాకలో ఎన్నికల హామీలు.. మంజూరైన పనులు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఖైరతాబాద్ డివిజన్లోని చింతలబస్తీలో రోడ్లు, డ్రైనేజీ, సివరేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయి. ఎమ్మెల్యే, కార్పొరేటర్లు పట్టించుకోకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతూ రోజులు వెల్లదీస్తున్నారు.
అన్ని పెండింగ్‌లే….
చింతలబస్తీలోని సప్తమాత దేవాలయం వద్ద రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. కొత్త రోడ్డు నిర్మాణం కోసం ఏడాదిన్నర క్రితమే రూ.45లక్షలు మంజూరయ్యాయి. కాని ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. ఎరుకల బస్తీలో రూ.6 లక్షల వ్యయంతో చేపట్టిన జీ+1 కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిలిచిపోయింది. రూ.24.50లక్షల వ్యయంతో తుమ్మలబస్తీ నుంచి రెడ్‌హిల్స్ వరకు చేపట్టాల్సిన 250ఎంఎం డయా పునరుద్ధరణ పనులు ముందుకు సాగడం లేదు. అలాగే ఎరుకలబస్తీ, ఆరెకటిక బస్తీ, చింతలబస్తీ, రెడ్‌హిల్స్ మీదుగా చేపట్టాల్సిన 250ఎంఎం డయా పనులు సైతం నిలిచిపోయాయి. ఈ పనుల కోసం ఇప్పటికే రూ.17.5లక్షలు మంజూరయ్యాయి. రూ.25లక్షలు మంజూరైనా సమైక్యభవన్ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణం జరగడం లేదు. మొత్తం రూ.1.17కోట్ల పనులు పెండింగ్‌లో ఉండగా, నిధులను పక్కదారి పట్టించకుండా త్వరితగతిన పరిష్కరించాలని బస్తీ వాసులు కోరుతున్నారు.