వనపర్తి, అక్టోబర్ 8: రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వనపర్తి వాసులతో కర్మన్‌ఘాట్‌లో ఉన్న అనంతరెడ్డి గార్డెన్స్‌లో ఆదివారం మంత్రి నిరంజన్‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలంగా మారనున్నదన్నారు. సాగునీరు, కళాశాలలు, రోడ్లవిస్తరణ వంటి పలు అభివృద్ధి పనులతో వనపర్తి రూపురేఖలు మారిపోయాయన్నారు. నూతనంగా నిర్మించేబోయే ఐటీ టవర్ వనపర్తికి మరో ఐకాన్‌గా నిలువనున్నదన్నారు. కొత్తగా గ్యారెంటీలంటూ నాయకులు వస్తున్నారని.. వారి మాటలు నమ్మొద్దన్నారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, బీఆర్ఎస్ శిక్షణా తరగతుల కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.