ఖైరతాబాద్, మార్చి 25 : పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్న ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలో ఒక విశిష్ట ఆరోగ్యభద్రతగా నిలిచింది. అత్యవసర శస్త్రచికిత్సల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు లక్షలాది మంది రోగులకు కొత్త జీవితాన్ని ఇచ్చిన ఈ పథకం వైద్య రంగంలో ఒక చారిత్రాత్మక సేవ. అయితే అదే ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య సేవలందించిన వైద్యులకు అందాల్సిన ఇన్సెంటీవ్స్ నిమ్స్‌లో అమలు కాకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. ఉచిత వైద్య సేవలందించే వైద్యులను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన ఈ ఆరోగ్యశ్రీ ప్యాకేజీ మార్గదర్శకాలు నిమ్స్ దవాఖానలో కేవలం కాగితాలకే పరిమితమయ్యాన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో ఆర్టీ నం. 134, తేదీ. 1-02-2010 ప్రకారం ప్రభుత్వ వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ సేవలందించే వైద్యులకు సైతం 35 శాతం ఇన్సెంటీవ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఈ ప్యాకేజీ నిరాటంకంగా అమలవుతూ వస్తున్నది. కానీ నిమ్స్ దవాఖానలో మాత్రం వైద్యులు ఈ ఇన్సెంటీవ్స్ కు నోచుకోవడం లేదని తెలిసింది.
ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో భాగంగా కేసు మొత్తంలో 35 శాతం ఇన్సెంటీవ్స్ రోగి చికిత్సలో నేరుగా పాల్గొన్న సిబ్బందికి పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో మెడికల్ లేదా సర్జికల్ టీమ్, అనస్తీషియా వైద్యులు, డయాగ్నస్టిక్ విభాగాలు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందితో పాటు క్లాస్-4 ఉద్యోగులు సైతం భాగస్వాములవుతారు. అవసరమైతే ఇతర నిపుణుల సేవలకు కూడా ఈ నిధుల నుంచే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం 35 శాతం ఇన్సెంటీవ్స్‌ను విభజించే విధానం కూడా స్పష్టంగా ఉంది. సర్జికల్ లేదా మెడికల్ టీమ్‌కు 75 శాతం, ఇన్వెస్టిగేటీవ్ విభాగాలకు 10 శాతం, నర్సింగ్
సిబ్బందికి 10 శాతం, క్లాస్-4 సిబ్బందికి 5 శాతం కేటాయించాలి.
ఇక సర్జికల్ కేసుల్లో వైద్యులకు 55 శాతం, అనస్తీషియా టీమ్‌కు 20 శాతం (ఐసీయూ కేసుల్లోనైతే 25 శాతం) ఇవ్వాలి. మెడికల్ కేసుల్లో పరిస్థితులను బట్టి మొత్తం 75 శాతం సంబంధిత వైద్య బృందానికి ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా ఈ మొత్తం నుంచి 10 శాతం రెసిడెంట్లకు కేటాయించిన తర్వాత మిగిలిన 90 శాతం మొత్తాన్ని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితర ఫ్యాకల్టీ సభ్యులకు నిర్ద్ధిష్ట నిష్పత్తిలో పంచాలని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి.
ప్రొఫెసర్లకు అదనంగా 5 శాతం, మరో 3 శాతం ప్రోత్సాహకం, అసోసియేట్ ప్రొఫెసర్లు, డిప్యూటీ సివిల్ సర్జన్లకు 3 శాతం అదనంగా ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. అయితే ఈ స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఇన్సెంటీవ్స్ విడుదలలో జాప్యం కొనసాగుతుండడంతో నిమ్స్ వైద్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఆదేశాలున్నప్పటికీ ఫైలు కదలకపోవడం విచారకరమంటూ పలువురు వైద్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు రావాల్సిన ఇన్సెంటీవ్స్ పూర్తి బకాయిలతో సహా చెల్లించాలని నిమ్స్ వైద్యులు కోరుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ ఆరోగ్యశ్రీ ప్యాకేజీ విజయవంతంగా అమలవుతూ వస్తున్నది. అన్ని ప్రభుత్వ వైద్యశాలలకు చెందిన వైద్యులకు ఆ ఇన్సెంటీవ్స్ అందుతున్నాయి. కానీ డైరెక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మొదటి నుంచి నిమ్స్ వైద్యులకు మాత్రం ఆరోగ్యశ్రీ ప్యాకేజీ అందకుండా పోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నెలరోజుల కిందట నిమ్స్‌కు చెందిన పలువురు వైద్యులు ప్రస్తుత ఆరోగ్య మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు. నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ఇన్సెంటీవ్స్ అందకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన మంత్రి..ప్రస్తుత డైరెక్టర్‌కు చివాట్లు పెట్టినట్లు తెలిసింది. తక్షణమే ఆ ఫైలు క్లియర్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే నెల రోజులు గడిచినా..డైరెక్టర్ ఫైలును ముందుకు కదపకపోవడంతో ఆయన తీరుపై వైద్యులు మండిపడుతున్నట్లు తెలిసింది.