ఖైరతాబాద్, జూన్ 10 : నిమ్స్‌లో నిత్యం రోగులకు అందుబాటులో ఉంటూ.. ఎందరో ప్రాణాలు నిలిపే వివిధ విభాగాధిపతులు, వైద్యులు , సర్జన్లకు ఈవినింగ్ క్లినిక్ ఇన్సెంటివ్స్ అందడం లేదు. ఈవినింగ్ క్లినిక్ ఇన్వెస్టిగేషన్స్ (వైద్య పరీక్షలు)కు సంబంధించిన రుసుము కేవలం ప్యాథాలజీ రిపోర్టులు రాసే వైద్యులు, పరీక్షలు చేసే సిబ్బందికి మాత్రమే ఇస్తూ.. తమకు వాటా ఇవ్వడం లేదని డాక్టర్లు, సర్జన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్ అందకపోవడంతో నైరాశ్యంలో ఉన్న వైద్యులు.. ఈవినింగ్ క్లినిక్‌కు సంబంధించిన ఇన్సెంటివ్స్ కూడా రాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
నిమ్స్ దవాఖానలో సాయంత్రం వేళ కూడా రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ఈవినింగ్ క్లినిక్‌ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. సాధారణంగా ఉదయం ఓపీలను చూసే సర్జన్లు, హెచ్వోడీలు మధ్యాహ్నం తమ విధులు ముగించుకొని వెళ్లిపోతారు. అయితే సాయంత్రం వేళల్లో సైతం రోగుల కోసం అందుబాటులో ఉండేలా తమ సమయాన్ని వెచ్చిస్తే వారికి ప్రోత్సాహకంగా కన్సల్టెన్సీ ఫీజులో కొంత భాగాన్ని వారి జీతాల్లో చేర్చే వెసులుబాటు కల్పించారు. అయితే సాయంత్రం వేళల్లో వైద్యులు సూచించే పరీక్షలకు మాత్రం ప్యాథాలజిస్టులు, రిపోర్టులు ఫైనల్ చేసే ఆయా విభాగాల వైద్యాధికారులు, వైద్యులకు మాత్రమే అందిస్తున్నారు.
అందుకు గాను ఒక్కో పరీక్ష రుసుములో 20 శాతం చెల్లిస్తున్నారు. కానీ ఆ పరీక్షలు చేయాలని సూచించే వివిధ వైద్యులకు మాత్రం అందులో ఎలాంటి వాటా కల్పించడం లేదు. అంతేకాకుండా గతేడాది సెప్టెంబర్ 1 నుంచి గత నెల 31 వరకు న్యూక్లియర్ మెడిసిన్‌తో పాటు వివిధ విభాగాలకు చెందిన వారికి వైద్య పరీక్షలకు సంబంధించి కోట్లాది రూపాయల ఇన్సెంటివ్స్ ఇటీవల విడుదల చేశారు. కానీ తమకు మాత్రం అన్ని అర్హతలున్నా.. కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదంటూ వైద్యులు వాపోతున్నారు.
నిమ్స్‌లో పనిచేసే ప్రతి వైద్యుడు సేవాభావంతోనే విధులు నిర్వహిస్తారు. ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానల్లో లక్షలాది రూపాయల ప్యాకేజీలను కాదనుకొని ప్రభుత్వం అందించే జీతాన్నే తీసుకొని పేదలకు వైద్య సేవలందించడంలో నిమగ్నమవుతారు. ప్రధానంగా ఈవినింగ్ క్లినిక్‌లు చూసే నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, కార్డియో థోరాసిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ తదితర విభాగాల హెచ్వోడీలు, ప్రొఫెసర్లు, వైద్యులు కేవలం తమకు కేటాయించిన ఉదయం, సాయంత్రం విధులకే కాదు.. 24/7 అందుబాటులో ఉంటారు. అత్యవసర వైద్యసేవలు, శస్త్రచికిత్సలు అవసరమైతే అర్థరాత్రుళ్లు ఆస్పత్రికి చేరుకొని సేవలందిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్ అందడం లేదని, మరో వైపు కనీసం ఈవినింగ్ క్లినిక్ ఇన్సెంటివ్స్ అయిన అందించాలని కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా నిమ్స్ తప్ప.. అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రతి వైద్యుడికి ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్ అందుతున్నాయి. ప్రస్తుతం ఆ ఫైలు సంబంధిత శాఖ మంత్రి చేతిలో ఉండగా, ఆ ఫైల్‌ను తక్షణమే క్లియర్ చేయాల్సిన అమాత్యుడు పక్కన పెట్టడంతో ప్రస్తుతం అది సెక్రటేరియేట్‌లో ములుగుతున్నదని పలువురు వైద్యులు తెలిపారు. నూతన డైరెక్టర్ చొరవ తీసుకొని ఆ ఫైలును క్లియర్ చేసేందుకు కృషి చేయాలని కోరుతున్నారు.