Hyderabad | ఎల్బీనగర్, ఏప్రిల్ 20 : హైదరాబాద్ నగరంలోని నాగోల్ చౌరస్తాలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు. అనంతరం దుండగులు అక్కడ్నుంచి పారిపోయారు.
పోలీసుల కథనం మేరకు.. నాగోల్‌కు చెందిన పంగా మనోజ్ ( 24) తన స్నేహితుడు బందెల వంశీ( 21) తో కలిసి శనివారం రాత్రి 1:50 గంటలకు నాగోల్ ఫ్లైఓవర్ యు-టర్న్ దగ్గర ఉన్న రాజుగారి బిర్యాని హోటల్ ముందు మెయిన్ రోడ్డు పక్కన ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చారు. వంశీ, మనోజ్ యాక్టివాపై కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. మనోజ్ స్నేహితుడైన జయపురి కాలనీకి చెందిన సంజయ్ (27), మహేష్, మరో స్నేహితుడు మొత్తం ముగ్గురు కలిసి ఒక పల్సర్ బైక్‌పై అక్కడికి చేరుకున్నారు. టిఫిన్ చేస్తున్న మనోజ్‌పై సంజయ్ అతని స్నేహితులు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. కిందపడిపోయిన మనోజ్‌పై కూర్చుని.. కత్తితో గొంతు కోశాడు సంజయ్.
మనోజ్‌ను ప్రాణాలతో కాపాడేందుకు యత్నించిన వంశీపై కూడా సంజయ్ కత్తితో పొడిచాడు. దీంతో వంశీ ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రక్తపు మడుగులో పడి ఉన్న మనోజ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మనోజ్ డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
మనోజ్, సంజయ్ స్నేహితులు. అయితే 2023 ఏప్రిల్‌లో మనోజ్, సంజయ్‌కి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. నాడు సంజయ్‌పై మనోజ్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఎల్బీ నగర్ పీఎస్‌లో మనోజ్‌పై కేసు నమోదైంది. కాగా సంజయ్, మనోజ్ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన చర్చల్లో భాగంగా కేసును ఉపసంహరించుకున్నారు. సంజయ్ రూ. 3 లక్షలు తీసుకుని కేసు వెనక్కి తీసుకున్నాడు. కానీ సంజయ్ మాత్రం మనోజ్‌పై కక్ష పెంచుకుని కత్తితో పొడిచి చంపాడు. చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.