Youth Murder | మెహిదీపట్నం, మే 15 : హత్య కేసులో నిందితుడిగా ఉన్న యువకుడు కోర్టుకు హాజరై ఇంటికి తిరిగి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ బాబా నగర్‌కు చెందిన అయాన్ ఖురేషి (20) తన బావ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు.
గురువారం నాంపల్లి కోర్టులో హాజరయ్యేందుకు వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో నిలోఫర్ హోటల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు అయాన్ ఖురేసిని కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్ర గాయాలతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ సంజయ్‌తో కలిసి పరిశీలించారు. హత్యకు పాల్పడ్డ వారిని పట్టుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.