Murder | అల్లాపూర్, ఫిబ్రవరి 25: భాను ప్రకాష్ అనే యువకుడిని సోమవారం అర్ధరాత్రి స్నేహితులే దారుణంగా హత్య చేసిన సంఘటన అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తాగిన మైకంలో స్నేహితుల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహించిన కొందరు యువకులు భాను ప్రకాష్‌పై విచక్షణారహితంగా కత్తులతో, రాళ్లతో, మద్యం బాటిళ్ల తో తలపై అతికిరాతంగా దాడి చేసి హతమార్చారు.
సమాచారం అందుకున్న అల్లాపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పాత కక్షల కారణంగానే భాను ప్రకాష్ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.