Love Affair | హిమాయత్ నగర్, మార్చి22 : పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి మోసం చేసిన ఓ యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ఘటన శనివారం నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఖానాపూరం ప్రాంతానికి చెందిన మల్లెల శ్రీనివాస్ చారి(30) నగరానికి వచ్చి కారు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువతి(30) గాంధీనగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఈ క్రమంలో 2018లో శ్రీనివాస్ చారితో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది.
పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పడంతో ఆమె శ్రీనివాసచారికి దగ్గరైంది. హిమాయత్ నగర్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మూడేండ్ల పాటు కలిసి సహజీవనం చేశారు. శారీరకంగా ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. పెండ్లి చేసుకుందామని ఆ యువతి శ్రీనివాస చారిపై ఒత్తిడి చేయడంతో దాటవేస్తూ నెమ్మదిగా ఆమెను దూరం పెట్టడం మొదలు పెట్టాడు. మోసపోయానని గ్రహించిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా శ్రీనివాస చారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ యు. చంద్రశేఖర్ తెలిపారు.