Medchal | మేడ్చల్, జూన్ 1 : మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో పలువురు యువకులు మద్యం తాగి వీరంగం సృష్టించారు. కాలనీ ఇండ్ల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం తాగుతూ గట్టిగా అరుస్తూ న్యూసెన్సుకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించి స్థానికంగా నివాసం ఉండే సందీప్ రెడ్డి ఇదేమిటని ప్రశ్నిస్తే అతడిపై దాడికి వచ్చారు. పదిమంది వరకు అతడి పైకి దాడికి వచ్చి తోసేశారు. ఈ ఘటనలో ఆయన చొక్కా చిరిగింది. దీంతో సందీప్ రెడ్డి 100 కి ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి ఘటనపై విచారణ జరిపారు.
ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. తరచుగా యువకులు ఈ ప్రాంతంలో మద్యం తాగుతూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇంట్లో మహిళలు ఒంటరిగా ఉంటే మద్యం తాగే యువకులు చేసే అల్లరికి భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో మధ్యలో బహిరంగంగా మద్యం సేవించే వారిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.