Hyderabad | మలక్ పేట, ఫిబ్రవరి 15 : ఆయుధాలతో సంచరిస్తున్న యువకుడిని చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ద నుంచి ఒక చాకును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ భరత్ కుమార్ కథనం ప్రకారం.. శుక్రవారం చాదర్ ఘాట్ పోలీసులు పాత మలక్‌పేట డివిజన్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, వాటర్ ట్యాంక్ వద్ద మహమ్మద్ ఇమ్రాన్ అలియాస్ టక్లా ఇమ్రాన్ (26) అనే యువకుడు అనుమానాస్పదంగా సంచరిస్తూ పోలీసుల వాహనాన్ని చూసి పారిపోయేందుకు యత్నించాడు. దాంతో అనుమానం కలిగిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా, అతని వద్ద పౌచ్‌లో ఒక చాకు దొరికింది. దాంతో ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు యువకుడిపై ఆయుధాల చట్టం ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఎస్ఐ భరత్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.