Hyderabad | ఖైరతాబాద్, ఫిబ్రవరి 7 : ఉప ముఖ్యమంత్రి నివాసంతో పాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ అధికార, పోలీసు యంత్రాంగం నిత్యం సందర్శించే ప్రజాభవన్‌కు కూతవేటు దూరంలో ఓ వృద్ధుడి దారుణ హత్య జరిగింది. ఎనిమిది పదులు దాటిన వృద్ధుడిని సొంత మనమడు హత్య చేశాడు. అడ్డుకోబోయిన తల్లిపైనా కత్తితో దాడి చేశాడు. అలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం… సోమాజిగూడ డివిజన్లోని బీఎస్ మక్తాకు చెందిన వి. చంద్రశేఖర జనార్ధన్ (84) వ్యాపారవేత్త. అతనికి బాలానగర్ తదితర ప్రాంతాల్లో ఇంజినీరింగ్ పరిశ్రమలు ఉన్నాయి. కోట్లాది రూపాయల ఆస్తి ఉండటంతో దానిపై మనుమడు కిలారు కీర్తి తేజ (23) కండ్లు పడ్డాయి. యూఎస్‌లో ఎంఎస్ చేసిన కీర్తి తేజ ప్రస్తుతం లాంకోహిల్స్ లో నివాసం ఉంటున్నాడు. గత కొంత కాలంగా ఆస్తి కోసం తాతతో గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం తాత వద్దకు వచ్చి గొడవకు దిగాడు. తాత మందలించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అడ్డువచ్చిన కన్న తల్లిపైనా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు.. ప్రైవేటు దవాఖానకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.
పారిశ్రామికవేత్త , వయోవృద్ధుడు చంద్రశేఖర జనార్దన్ హత్య 24 గంటల తర్వాత వెలుగు చూసింది. హంతకుడు కిలారు కీర్తి తేజ గురువారం నుంచి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి నివాసంతో పాటు ముఖ్యమంత్రి, కేబినేట్ మంత్రులు, ఉన్నతాధికారులు నిత్యం సందర్శించే ప్రజాభవన్ సమీపంలో హత్య జరిగి 24గంటలు గడిచినా నిందితుడి ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలమైనట్లు తెలుస్తోంది. హత్యోదంతంలో హతుడు, హంతకుడు ఇద్దరూ సంపన్నులే. ఈ నేపథ్యంలో ఘటనను గోప్యంగా ఉంచడంపై స్థానిక ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.