Hyderabad | శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 : రోడ్డు ప్రమాదంలో చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళినా… అందరి గుండెల్లో కలకాలం నిలిచిపోయింది ఓ డాక్టర్. తను మరణిస్తూ మరో ఐదుగురి భవిష్యత్‌కు కొత్త బాటలు వేసింది యువ డాక్టర్ నంగి భూమిక రెడ్డి.
వివరాల్లోకి వెళితే.. సత్యసాయి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం నంగివాండ్ల పల్లి గ్రామానికి చెందిన నంగి నందకుమార్ రెడ్డి, లోహిత దంపతుల ఒక్కగానొక్క కూతురు డాక్టర్ భూమిక రెడ్డి (24) ఇటీవల వైద్యవిద్య పూర్తి చేసి హైద్రాబాద్‌లోని ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్లో హౌస్ సర్జన్‌గా వైద్యసేవలు అందిస్తుంది.
అయితే భూమికారెడ్డి ఫిబ్రవరి ఒకటో తేదీన తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు తను ప్రయాణిస్తున్న కారు, అనుకోకుండా రోడ్డు డివైడర్‌కు ఢీకొని తీవ్ర ప్రమాదానికి గురయ్యింది. అపస్మారక స్థితిలో ఉన్న భూమిక రెడ్డిని దగ్గర్లో ఉన్న నానక్‌రామ్‌గూడలోని కాంటినెంటల్ హాస్సిటల్స్‌లో చేర్పించారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ న్యూరోసర్జన్ డాక్టర్ శివానందరెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు క్రానియాటరీ సర్జరీ చేసినా ఫలితం లేకుండా పోయింది. వారం రోజులపాటు మృత్యువుతో పోరాడుతూ చివరకు తుదిశ్వాస విడిచింది.
భూమిక రెడ్డి తల్లిదండ్రులు అవయవదానం చేసి మరో ఐదుగురికి ప్రాణం పోశారు. ఒక్కగానొక్క కూతురు లేదన్న బాధను గుండెల్లో దిగమింగుకుని… మరో ఐదుగురికి అవయవదానం (హార్ట్, లంగ్, లివర్, కిడ్నీలు) చేసి ఆదర్శంగా నిలిచారు. భూమిక రెడ్డి మన మధ్య లేకపోయినా.. ఆమె తల్లిదండ్రులు చేసిన ఈ గొప్పపని కలకాలం గుర్తుండిపోతుందని కాంటినెంటల్ హాస్సిటల్స్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి అన్నారు . భూమిక రెడ్డి తల్లిదండ్రులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఒక మంచి వైద్యురాలిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కూతురు బాధను దిగమింగుకుని.. అవయవదానానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ORR | ఓఆర్ఆర్పై రెచ్చిపోయిన యువకులు.. కార్లను గింగిరాలు తిప్పుతూ రేసింగ్‌లు.. Video
Child Dies | అన్నకు బాయ్ చెప్తూ.. ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి పడ్డ ఏడాదిన్నర చిన్నారి