Hyderabad | జగద్గిరిగుట్ట మార్చి 6: హైదరాబాద్లో ఓ మహిళ దొంగ రెచ్చిపోయింది. పట్ట పగలే తలుపులు తీసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడి.. ఆ ఇంట్లో నుంచి బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లింది. హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆల్విన్ కాలనీలో నివాసం ఉండే శ్రీకాంత్ ప్రైవేటు ఉద్యోగి. బుధవారం అతను డ్యూటీకి వెళ్లగా.. ఇంట్లో తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. సాయంత్రం సమయంలో శ్రీకాంత్ తండ్రి సుదర్శనం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో తలుపులు తీసే ఉన్నాయి. బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఇంట్లో ఏదో అలికి వినబడటంతో అకస్మాత్తుగా ఇంటి దగ్గరకు వెళ్లాడు. అప్పుడే ఓ మహిళ అనుమానాస్పదంగా ఇంటి నుంచి బయటకు వస్తోంది. అది గమనించిన సుదర్శనం ఎవరని ఆ మహిళను ప్రశ్నించగా.. అతన్ని తోసి అక్కడి నుంచి పారిపోయింది. దీంతో అనుమానం వచ్చిన సుదర్శనం ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువాలో ఉండాల్సిన ఆరు తులాల బంగారం, పది తులాల వెండి ఆభరణాలు కనిపించలేదు. దీంతో వెంటనే ఆయన తన కొడుకు శ్రీకాంత్ సాయంతో పోలీసు ఫిర్యాదు చేశాడు.
శ్రీకాంత్ ఇంట్లో చోరీ కంటే ముందు సమీపంలోని ఓ స్టూడియోలో కెమెరాలను ఎత్తుకెళ్లేందుకు సదరు మహిళ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పాస్పోర్టు ఫొటో దిగిన తర్వాత ఎక్కువ ధర చెప్పారని తన ఫొటో డిలీట్ చేయాలని వాదించింది. సరే అని ఫొటో డిలీట్ చేయడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సదరు మహిళ హిందీలో మాట్లాడినట్లు నిర్వాహకుడు చెప్పారు. స్టూడియోలో చోరీ కుదరకపోవడంతో అదే వీధిలో ఉండే ఓ ఇంట్లోకి వెళ్లి ఆభరణాలు చోరీ చేసినట్లు అనుమానిస్తున్నారు. సదరు కిలేడీతో పాటు మరో వ్యక్తి కూడా ఆ పరిసరాల్లో తిరిగినట్లు చెబుతున్నారు.