Crime news : రోజురోజుకు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తుల కోసం అయినవాళ్లనే హత్యలు చేస్తున్నారు. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఆస్తి కోసం ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హతమార్చింది. హైదరాబాద్ నగరంలో తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం కొడుగు కాఫీ ఎస్టేట్‌లో సగం కాలిన మృతదేహాన్ని కూలీలు గుర్తించారు. వెంటనే ఆ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త రమేశ్ కుమార్ (54) గా గుర్తించారు.
కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటక పోలీసులు సంచలన విషయాలు గుర్తించారు. ఆస్తి కోసం రమేశ్‌ను భార్య నిహారికనే ఆయనను హత్య చేసినట్లుగా తేల్చారు. రూ.8 కోట్ల ఆస్తి కోసం ప్రియుడు డాక్టర్ నిఖిల్ మైరెడ్డితో కలిసి రమేశ్‌ను ఆమె హతమార్చినట్లు తెలిపారు. వీరిద్దరూ శవాన్ని కాల్చివేసేందుకు రాణా అనే మరో వ్యక్తి సహాయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురూ కలిసి ఉప్పల్- భువనగిరి ప్రాంతంలో వ్యాపారవేత్తను హత్య చేశారని వెల్లడించారు.
హత్య అనంతరం మృతదేహాన్ని నిందితులు మెర్సిడెస్ బెంజ్ కారులో కర్ణాటక పరిధిలోని కొడగు కాఫీ ఎస్టేట్‌కు తరలించారని పోలీసులు పేర్కొన్నారు. అక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించి నిందితులు పరారయ్యారని తెలిపారు. రాణా హర్యానాకు చెందిన వ్యక్తి కాగా, నిహారిక యాదాద్రికి చెందిన మహిళ. ఆమె ప్రియుడు డాక్టర్ నిఖిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన వ్యక్తి.