బేగంపేట, జూన్ 7: భర్తతో మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్న ఓ వివాహితకు మత్తు మందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. బేగంపేట ప్రాంతానికి చెందిన ఓ మహిళ(37)కు 2013లో వివాహం కాగా.. భర్తతో మనస్పర్థల కారణంగా బేగంపేటలోని తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది. ఈ క్రమంలో నిజాముద్దీన్ అనే వ్యక్తి ఫోన్‌చేసి డెలివరీ బాయ్‌గా పరియయం చేసుకున్నాడు.
తరచూ ఆమెకు ఫోన్ చేస్తూ సందేశాలు పంపుతున్నాడు. అతని వేధింపులు భరించలేక ఓ రోజు పబ్లిక్ గార్డెన్లో నిజాముద్దీన్‌ను కలిసి.. భర్తతో గొడవల కారణంగా విడాకు లు ఇప్పించాలని చెప్పింది. దీంతో అతను.. విడాకులకు దరఖాస్తు చేసేందుకు ఆమె ఆధార్ కార్డు తీసుకున్నాడు. అనంతరం ఓ న్యాయవాదిని కలిసేందుకు గుడిమల్కాపూర్‌లోని ఓ హోటల్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెకు పండ్ల రసంలో మత్తుమందు తాగిపించాడు. ఆమె సృహా కోల్పోయాక లైంగిక దాడికి పాల్పడి.. ఫొటోలు , వీడియోలు తీశాడు. అనంతరం న్యాయవాది రాలేదని ఆమెను అక్కడి నుంచి పంపించాడు.
కొద్ది రోజుల తర్వాత ఫోన్‌చేసి తనకు లక్ష రూపాయలు కావాలని.. లేదంటే నీ ఫొటోలు, వీడియోలు బయట పెడతానని బెదిరించసాగాడు. అందుకు భయపడిన ఆమె.. ఏప్రిల్‌లో లక్ష రూపాయలు ఇచ్చింది. మళ్లీ మళ్లీ డబ్బులు కావాలని బెదిరిస్తున్నాడు. ఓ రోజు ఆమె రోడ్డుపై వెళ్తుండగా.. కారులో వచ్చిన అతను బలవంతంగా హోటల్‌కు తీసుకెళ్లి.. మరోసారి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.