Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 5 : తనతో పెళ్లికి నిరాకరించిందన్న కక్షతో వైద్యురాలిని వెంటపడి వేధిస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతి(26) ఎంబిబిఎస్ పూర్తి చేసుకుని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తుంది.
2015 నుంచి ఆమెకు స్నేహితురాలిగా ఉన్న యువతి 2021లో తన సోదరుడు వాసిఫ్ సిద్ధిఖీతో పరిచయం చేసింది. తన సోదరుడిని పెళ్లి చేసుకోవాలని కోరింది. దాంతో కుటుంబ సభ్యులకు విషయం చెప్పగా సిద్ధికి గురించి వాకబు చేశారు. అతడికి చెడు అలవాట్లు ఉన్నాయని, కొంతమంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని, చదువు కూడా మధ్యలోనే వదిలేశాడు అని తేలింది. దీంతో పెళ్లి సంబంధం ఇష్టం లేదని తిరస్కరించారు.
కాగా ఏడాది నుంచి యువతి వెంటపడి వేధిస్తుండడంతో పాటు ఆమె ఫోన్ లాక్కుని ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనను పెళ్లి చేసుకోకపోతే వాటిని తెలిసిన వారికి పంపిస్తా అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె పనిచేస్తున్న ఆస్పత్రికి వెళ్లి దాడి చేశాడు సిద్ధిఖీ. వేధింపులు ఎక్కువ కావడంతో శనివారం బాధిత వైద్యురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.