Woman Dies | పహడి షరీఫ్, ఫిబ్రవరి 17 : బట్టలు వాషింగ్ మెషీన్లో వేస్తుండగా.. విద్యుత్ షాక్‌కు గురై ఓ యువతి మృతి చెందింది. ఈ విషాద ఘటన బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బాలాపూర్ పీఎస్ పరిధిలోని షాహి నగర్‌కు చెందిన ఫాతిమా(16) మంగళవారం మధ్యాహ్నం.. వాషింగ్ మెషీన్లో బట్టలు వేసింది. అనంతరం నీళ్లు నింపింది. ఇక వాషింగ్ మెషీన్‌ను ఆన్ చేద్దామని స్విచ్ బోర్డు వద్దకు వెళ్లి.. ఆన్ చేసింది. అయితే అప్పటికే తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లను ఆమె గమనించలేదు. అక్కడున్న నీళ్లకు విద్యుత్ తీగలు తగిలి ఆమెకు కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఫాతిమా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.