బంజారాహిల్స్,నవంబర్ 30: బడుగు,బలహీన వర్గాలకు చెందిన పేదలకు అండగా నిలుస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. షేక్‌పేట మండల పరిధిలోని జూబ్లీహిల్స్ డివిజన్లో 1700 మందికి బుధవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ చేతులమీదుగా ఆసరా గుర్తింపు కార్డులు అందజేశారు.
ఫిలింనగర్‌లోని రామానాయుడు కళా మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్‌తో కలిసి పింఛన్ కార్డులను ఎమ్మెల్యే దానం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లడుతూ.. షేక్‌పేట మండల పరిధిలోని జూబ్లీహిల్స్ డివిజన్లో మొత్తం 1700మందికి గుర్తింపు కార్డులు ఇస్తున్నామన్నారు. వీటిలో 350దాకా కొత్తగా మంజూరైన పింఛన్లు ఉన్నాయన్నారు. పింఛన్లు రానివారు ఆందోళన పడవద్దు. త్వరలోనే మిగిలిన వారికి కూడా పింఛన్లు మంజూరవుతాయన్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో పేదల అవసరాల కోసం ఆరు మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణం కోసం మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేశారన్నారు. దీంతో పాటు నియోజకవర్గానికి నాలుగువేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తున్నామని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారన్నారు. నియోజకవర్గంలో దళితబంధు రెండో విడత కింద 500మందికి త్వరలో సాయం అందనుందన్నారు. ఈ కార్యక్రమంలో షేక్‌పేట తహసీల్దార్ రామకృష్ణ నాయక్, టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, అబ్దుల్ ఘనీ, నగేష్సాగర్, ఎల్లయ్య, గోపాల్‌నాయక్, పెరుక కిరణ్ తదితరులు పాల్గొన్నారు.