Hyderabad | ఉప్పల్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): మహా కుంభమేళాకు వెళ్లిన నగర వాసుల వాహనం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మినీ బస్సులో రెండు రోజుల క్రితం నాచారం నుంచి బంధువులు, స్నేహితులు కలిసి 9 మంది వరకు వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. యూపీ ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు చేసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా జబల్పూర్ వద్ద సిమెంట్ లారీ, మినీ బస్సు ఢీకొనగా ఏడుగురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారని టీవీల్లో వార్తలు రావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నాచారం, కార్తికేయనగర్, తార్నాక, మారుతీనగర్‌కు చెందిన కాలనీ వాసులు మృతి చెందినట్లు తెలిసింది.
నాచారానికి చెందిన శశికాంత్( 38), కార్తికేయ నగర్ కు చెందిన సంతోష్ కుమార్ (48) మరో ఇద్దరు దగ్గరి బంధువులు, స్నేహితులైన మల్లారెడ్డి, వెంకటప్రసాద్, రవికుమార్, నవీన్‌చారి, ఆనంద్, శ్రీరామ్ బాలకిషన్ స్థానికుడైన డ్రైవర్ రాజుతో కలిసి రెండు రోజుల క్రితం కుంభమేళాకు వెళ్లారు. శశికాంత్ ఉదయమే అమ్మతో మాట్లాడి తిరిగి వస్తున్నట్టు తెలిపాడు. అంతలోనే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సంతోష్ కుమార్ గోల్డ్ షాప్ నిర్వహిస్తున్నాడు. కొంత కాలం క్రితం తన భార్య చనిపోయింది. ఆ విషాదం నుంచి కోలుకోలేక ముందే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కార్తికేయ నగర్ కాలనీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మల్లారెడ్డి పాల వ్యాపారం నిర్వహిస్తుంటాడు.
మల్లారెడ్డి చనిపోవడంతో స్నేహితులు, బంధువులు విచారం వ్యక్తం చేశారు. నాచారం ఎర్రగుంటకు చెందిన మినీ బస్సు డ్రైవర్ రాజు చనిపోవడంతో విషాదం నెలకొంది. తార్నాక గోకుల్ నగర్ కు చెందిన వెంకట ప్రసాద్ (48) బ్యాంక్ ఆఫ్ బరోడా లో పనిచేస్తున్నారు. రవికుమార్ మెడికల్ షాప్ నిర్వాహకుడు చనిపోయిన వారిలో ఉన్నారు. నవీన్, ఆనంద్ కుమార్, సంతోష్,శశికాంత్ దగ్గర బంధువులుగా పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి బాధిత కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.
మృతదేహాలను తెప్పించేందుకు ఏర్పాట్లు..
మేడ్చల్, ఫిబ్రవరి11(నమస్తే తెలంగాణ): మహా కుంభమేళా నుంచి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ మహేందర్‌రెడ్డి జిల్లా యంత్రాంగంతో చర్చించారు. ప్రమాదంలో మేడ్చల్ జిల్లాకు చెందిన ఉప్పల్ నియోజకవర్గం నాచారం, తార్నాక కు చెందిన ఏడుగురు మృతి చెందగా ఇద్దరికీ త్రీవ గాయాల పాలవడం బాధాకరమన్నారు. మృతి చెందిన వారిలో బౌరంపేట్ సంతోష్‌కుమార్, రాంపల్లి రవికుమార్(నాచారం), శశికాంత్, రాజు (నాచారం), మల్లారెడ్డి(నాచారం), ప్రసాద్(తార్నాక) ఆనంద్‌కుమార్(దిల్షుక్నగర్) గాయపడిన వారిలో శ్రీరామ్ బాలకృష్ణ(నాచారం), సుంకజ నవీన్(సరూర్‌నగర్)లు ఉన్నట్లు మహేందర్‌రెడ్డి తెలిపారు.