సిటీబ్యూరో, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): మూడురోజుల క్రితం అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కిడ్నాపైన రెండేళ్ల బాలుడిని స్థానిక పోలీసులు ఫిర్యాదు అందిన 48 గంటల్లో రక్షించారు. ఆ బాలుడిని అమ్ముదామని లేదా భిక్షాటన కోసం వాడుకుందామని ప్రయత్నించిన నలుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో కిడ్నాప్‌కు సంబంధించిన వివరాలను అడిషనల్ డీసీపీ నర్సయ్య, సుల్తాన్‌బజార్ ఏసీపీ శంకర్‌లతో కలిసి తెలిపారు. షేక్ అమెర్ అలియాస్ తార మద్యం మత్తులో ఉన్న తల్లిదండ్రులను వెతికి వారి వద్ద ఉన్న పిల్లలను తన ముఠా సాయంతో కిడ్నాప్ చేసి పిల్లలు లేని వారికి, పిల్లలతో భిక్షాటన చేయించే వారికి అమ్ముతాడు.
ఐదురోజులక్రితం కడప జిల్లా మైలవరం మండలం బద్వేల్ గ్రామానికి చెందిన బందెల దేవి అనే మహిళ తన రెండేళ్ల కుమారుడు ప్రేమ్‌తో కలిసి నగరానికి పని కోసం వచ్చింది. ఈనెల 15న ఆమె గౌలిగూడ ఫుట్‌పాత్‌పై మద్యం మత్తులో నిద్రిస్తుండగా ఆమె కుమారుడు ప్రేమ్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. తాను నిద్ర లేచిన తర్వాత వెతికితే కుమారుడు కనిపించకపోవడంతో అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఈనెల 16న ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన పోలీసులు బాలుడి కిడ్నాపర్లను, వారి కదలికలను గుర్తించారు. మూడుటీమ్లుగా ఏర్పడి కిడ్నాపైన బాలుడిని రక్షించారు. ఈ కేసులో షేక్ అమీర్ అలియాస్ తార, మజిదాబేగమ్ , మహ్మదీబేగమ్లను అరెస్ట్ చేయగా అబ్దుల్ సల్మాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాపైన బాలుడిని తల్లివద్దకు సురక్షితంగా చేర్చారు. 48 గంటలలోనే కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్లు మధుకుమార్, ఎన్వ్రిలతో పాటు ఎస్ఐ జగదీశ్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.