Traffic Constable | వెంగళరావునగర్, మే 14 : ఓ ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రహ్మత్ నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయం సమీపంలో తిరుమలగిరి పోలీసుస్టేషన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సాయికుమార్ (35) నివాసం ఉంటున్నారు. సాయికుమార్ భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్ళింది. వారం రోజుల క్రితం వీరికో పాప పుట్టింది. మంగళవారం ఉదయం ఇంట్లోని తన గదిలో బెల్ట్‌తో ఉరి వేసుకున్నాడు. వెంటనే అతని తల్లి గమనించి బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు కాపాడి దవాఖానాకు తరలించారు. సాయికుమార్ పరిస్థితి నిలకడగా ఉందని.. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఫిర్యాదు రాని కారణంగా ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.