మలక్పేట, డిసెంబర్ 30: ద్విచక్ర వాహనం (యాక్టీవా)పై వెళ్తుండగా చైనా మాంజా గొంతుకు తగిలి యువకుడి గొంతు కోసుకుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మలక్పేట ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించిన ఘటన సరూర్నగర్ శివ గంగా థియేటర్ వద్ద జరిగింది. స్థానికులు, ట్రాఫిక్ పోలీసుల కథనం ప్రకారం అశోక్ అనే యువకుడు మంగళవారం తన యాక్టీవా వాహనంపై దిల్సుఖ్నగర్ నుంచి సరూర్నగర్ వైపు వెళ్తుండగా, శివ గంగా థియేటర్ వద్ద చైనా మాంజా గొంతుకు తగిలి కోసుకుపోయింది. దీంతో తీవ్రంగా గాయపడటంతో వెంటనే స్పందించిన స్థానికులు, మలక్పేట ట్రాఫిక్ పోలీసులు యువకుడిని దిల్సుఖ్నగర్లోని కమలా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రమాదకరమైన చైనా మాంజాను నగరంలో పూర్తిగా నిషేధించాలని డిమాండ్చేశారు. చైనా మాంజాను విక్రయించకుండా విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చైనా మాంజా దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని వారు కోరారు.