Hyderabad | వెంగళరావునగర్, ఏప్రిల్ 8 : లేడీస్ హాస్టళ్లలోకి ఓ దొంగోడు జొరబడ్డాడు. అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా జొరబడి యువతుల ల్యాప్‌టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్‌కు చెందిన సింధు(29) నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ.. మధురానగర్‌లోని శ్రీ సాయి సద్గురు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో గత ఐదేళ్ల నుంచి ఉంటుంది. తన బ్యాగులో ల్యాప్‌టాప్, ఏటీఎం కార్డ్, ఆధార్ కార్డ్, మరికొన్ని సర్టిఫికెట్స్‌ను దాచుకుని నిద్రపోయింది. సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో ఓ దొంగ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించాడు. బ్యాగును చోరి చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. తెల్లారక చూసుకుంటే తన బ్యాగ్ కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అలాగే ఏపీ మంగళగిరికి చెందిన యువతి కె.మనస్వి (24) నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ మధురానగర్‌లోని రామిరెడ్డి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నివాసం ఉంటుంది. సోమవారం రాత్రి హాస్టల్లోని రూమ్‌లో మనస్వి గాఢనిద్రలో ఉన్నప్పుడు ఓ దొంగ జొరబడ్డాడు. ల్యాప్ టాప్, ఛార్జర్, విలువైన వస్తువులను బ్యాగులో దాచుకుంది. మనస్వి నిద్రలోకి జారుకున్నాక ఆమె రూమ్‌లోకి దొంగ జొరబడి బ్యాగును అపహరించి పరారయ్యాడు. రెండు హాస్టళ్లలో చోరి చేసి బ్యాగులతో దొంగ ఉడాయించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఓ లేడీస్ హాస్టల్లో వాచ్మెన్ లేకపోవడం.. మరో హాస్టల్లో వాచ్మెన్ ఉన్నా అతను నిద్రపోవడంతో దొంగకు అడ్డంకులు లేకుండా పోయాయి. లాభాపేక్షతో హాస్టళ్లను నిర్వహిస్తూ భద్రతను గాలికొదిలేశారని బాధిత యువతులు వాపోయారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.