సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : గణేశ్ నవరాత్రి ఉత్సవాల వేళ గ్రేటర్ పరిధిలోని ఠాణాల పరిధిలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. కొన్ని పీఎస్‌ల పరిధిలో వినాయక నిమజ్జనాల సందర్భంగా పాడ్బ్యాండ్ను అనుమతిస్తుంటే.. మరికొన్నిచోట్ల తమ పరిధిలో అలాంటి వాటికి తావు లేదంటూ బ్యాండ్ కొట్టేవారిపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారు.
ప్రజలతో మమేకమవుతూ వినాయక నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల నడుమ ప్రశాంత వాతావారణంలో నిర్వహించేందుకు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పోలీసులకు సూచనలు చేస్తుంటారు. అయితే కొంతమంది పోలీసులు మాత్రం ఏదీ ఏమైతే మాకేంటి.. మేం చెప్పిందే రూల్, నా ఇలాఖాలో నేను చెప్పిందే నడవాలి అన్నట్లుగా నిమజ్జనాల నిర్వహణపై ఆంక్షలు విధిస్తున్నారు. ఇటీవల బోనాల పండుగ సందర్భంగా మల్కాజిగిరి ఠాణా పరిధిలో ఫలహారం బండి ఊరేగింపునకు లైట్లు ఏర్పాట్లు చేస్తే అడ్డంకులు సృష్టించారు.
పక్కనే ఉన్న ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేశారు. అలాంటిదే ఇప్పుడు వినాయక నిమజ్జనాల సందర్భంగా ఒక్కో ఎస్హెచ్ఓ.. ఒక్కో రకమైన రూల్స్ పెడుతూ మండపాల నిర్వాహకులు, భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వనస్థలిపురం డివిజన్లోని పక్కపక్క పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన ఈ రెండు ఘటనలే ఆయా ఎస్హెచ్ఓల వ్యవహారశైలికి ప్రత్యక్ష ఉదాహరణలు.
వనస్థలిపురం పీఎస్ పరిధిలో..
వనస్థలిపురం పోలీసులు వినాయక చవితి వేడుకలను పోలీస్ స్టేషన్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కమ్యూనిటీ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా స్థానిక ప్రజలు, సిబ్బందిని వినాయక వేడుకల్లో భాగస్వాములను చేశారు. 3 రోజుల తర్వాత గణనాథుడికి భక్తి శ్రద్ధలతో స్థానిక ప్రజలు, సిబ్బందితో కలిసి నిమజ్జనానికి తరలించారు. ఇందులో భాగంగా పోలీసులు పాడ్ బ్యాండ్, డీజే సౌండ్లను వాడారు. అలాగే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతర మండపాల నిర్వాహకులు కూడా పాడ్ బ్యాండ్‌ను ఉపయోగించుకుంటూ భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌తో ప్రజలతో మమేకమవుతూ ఇక్కడి పోలీసులు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు నిర్వహించేలా మండపాల నిర్వాహకులకు సూచనలిస్తున్నారు.
మీర్పేట్ పీఎస్ పరిధిలో…
మీర్పేట్లో సీన్ అందుకు భిన్నంగా నడుస్తున్నది. డీజేలను వాడొద్దనే నిబంధన ఉంది. దీనిని ఆసరాగా చేసుకొని పాడ్ బ్యాండ్, సౌండ్ బాక్స్‌లు, డీజేలు ఏమి పెట్టినా వారిని మీర్పేట్ పోలీసులు అడ్డుకుంటున్నారు. డప్పు వాయిద్యాలతో నిమజ్జనానికి తరలివెళ్తున్నా అలాంటి వారిని ఆపి మరీ కేసులు నమోదు చేస్తున్నారు. పాడ్బ్యాండ్తో పాటు ఒకటి రెండు సౌండ్ బాక్స్‌లు, పాడ్ బ్యాండ్ డీజేలను వాడుతూ నిమజ్జనాలకు వెళ్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మేం వాడుతున్నది డీజే కాదని, తక్కువ సౌండ్లతో బ్యాండ్ మేళాలు అని చెప్పినప్పటికీ పోలీసులు ససేమిరా అంటున్నారు. పక్కనే ఉన్న వనస్థలిపురం పరిధిలో ఏకంగా పోలీసులు.. నిమజ్జనానికి పాడ్ బ్యాండ్ డీజేలతో వెళ్లారని, మా వద్దకు వచ్చే వరకు నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మండపాల నిర్వాహకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
డీజేలపై నిషేధం ఉంది
వినాయక నిమజ్జనాలలో డీజేలతో పాటు అధిక శబ్ధాలు వచ్చే సామగ్రిని వాడొద్దని సూచనలు చేశాం. అంతటా ఒకే విధంగా ఉంటుంది. ఒకచోట అనుమతించి, మరోచోట అనుమతించకపోవడం అంటూ ఉండదు. పాడ్బ్యాండ్ డీజేలలో అధిక శబ్ధం వస్తే అలాంటి వాటిని అనుమతించరు. వనస్థలిపురంలో జరిగిన విషయం నా దృష్టికి రాలేదు, తెలుసుకుంటాను. అలాగే మీర్పేట్లో నిమజ్జన సమయాల్లో కేసుల నమోదులో పోలీసులు ఎలా వ్యవహరించారనే విషయాన్ని పరిశీలిస్తాం.
– ప్రవీణ్‌కుమార్, ఎల్బీనగర్ డీసీపీ