సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): నకిలీ పత్రాలు సృష్టించి ఖాళీ జాగాలను కబ్జా చేస్తున్న ముఠాలు ఇంకా ఎన్ని ఉన్నాయనేది పోలీసులకు కూడా అశ్చర్యకరంగా మారుతోంది. కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోనే వరుసగా వస్తున్న ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేసి ఆయా ముఠాలను అరెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. వారానికో ఫిర్యాదు ఈ ముఠాలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఇవన్నీ గతంలో సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన అధికారి హయాంలోనే జరిగినట్లు పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఇప్పటికే కేవలం కీసర పోలీస్‌స్టేషన్‌లోనే 21 కేసుల వరకు నమోదయ్యాయి. ఒక్కో ఘటనలో ఒక్కో ముఠా వెలుగులోకి వస్తుండడంతో ఇంకా ఎన్ని జాగాలను ఈ ముఠాలు కొట్టేశాయనేది ప్రశ్నార్థకంగా మారింది. 30 ఏండ్ల కిందట ప్లాట్లు కొనుగోలు చేసి వాటిని ఖాళీగా ఉంచిన వాటినే ఈ ముఠాలు టార్గెట్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
ఫేక్ డాక్యుమెంట్లతో..
ఖాళీగా ఉన్న ప్లాట్లు ఎవరివి అనేది ముందుగా ఈ ముఠాలు పరిశీలిస్తున్నాయి. కొన్నేండ్ల కిందట నుంచి ఖాళీ ఉన్న ప్లాట్ల వద్దకు ఆయా యజమానులు ఎవరు రాకపోవడానికి ఆసరగా చేసుకొని ఈ ముఠాలు ఆ ప్లాట్లకు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నాయి. నకిలీ పత్రాలతో పాటు అసలైన యజమానుల జనన, మరణ ధ్రువీకరణపత్రాలను సైతం తయారు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా నకిలీ మనుషులను అసలైన యజమానులుగా చూపిస్తూ రిజిస్ట్రేషన్లు సైతం చేసిన ఘటనలు ఉన్నాయి. నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ మనుషులతో రిజిస్ట్రేషన్లు జరిగిన ఘటనలలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం అధికారుల పాత్ర స్పష్టమవుతోంది. ఫిర్యాదు రాగానే పోలీసులు దానిపై కేసు పెట్టి నిందితులను పట్టుకుంటున్నారు.
అయితే ఇంకా చాలా వరకే ఈ నకిలీల దందా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఒక్క కేసు నమోదు కాగానే అక్కడితోనే పోలీసులు దర్యాప్తును ఆపేస్తున్నారు. ఇలా ఒక్కో ప్లాట్‌కు ఒక్కో ముఠాకు, మరో ముఠాకు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 30 ఏండ్ల కిందట శివారులలో ప్లాట్లు కొన్నవారు కొందరు విదేశాలలో సైతం ఉంటున్నారు. అలాంటి వారు ఇక్కడకు వచ్చి తమ ప్లాట్లు, తమ ప్లాటు డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా అనే విషయం చూసుకుంటే ఇంకా కొన్ని ఘటనలు బయటకు వచ్చే అవకాశాలున్నాయంటూ స్థానికులు చెబుతున్నారు.
బాధితులు ముందుకొస్తేనే..!
ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. కేవలం కీసర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని జరిగిన ఘటనలే ఎక్కువగా పోలీస్‌స్టేషన్ వరకు వస్తున్నాయి. పరిసర ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు తక్కువగానే జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే బాధితులు రాకుండా మేం ఈ ముఠాలను పట్టుకోలేమని, బాధితులు తమ ఖాళీగా ఉన్న జాగాలను పరిశీలించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే డాక్యుమెంట్లు మారాయా? మీ డాక్యుమెంట్లను ఉపయోగించి ఇతరులెవరైనా ఆయా ఖాళీ జాగాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? అనే విషయాలపై బాధితులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.