సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ) /మూసాపేట : కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. కూకట్పల్లి గ్రామ కంఠంలో ఫ్లాట్ నెంబర్ 5-3-107/A 187.96 చదరపు గజాలలో పట్లోరి పద్మజ, లక్ష్మణ్‌రావు దంపతులు G +2 అనుమతులు తీసుకుని 5 అంతస్తుల నిర్మాణం చేపట్టారు. శనివారం మధ్యాహ్నం నాలుగో అంతస్తు స్లాబ్ వేసి రెడిమిక్స్ పైప్‌లు తొలగిస్తున్న సమయంలో స్లాబ్ కుప్పకూలింది. ఆ సమయంలో మూడో అంతస్తులో పనిచేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆనంద్(24), దయాశంకర్(25) కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. అక్కడే ఉన్న భవన యాజమాని లక్ష్మణ్‌రావు, మరో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దవాఖానకు తరలించారు.
డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎప్, ఫైర్, పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. 5గంటలు శ్రమించి రెండు మృత దేహలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఈ విషయంపై డీసీ రవీందర్ కుమార్‌ను వివరణ కోరగా నాసిరకం నిర్మాణం కారణంగానే భవనం స్లాబ్ కుప్పకూలిందని చెప్పారు. అనుమతులకు విరుద్దంగా నిర్మాణాన్ని చేపడుతున్న భవన యాజమానురాలు పట్లోరి పద్మజకు నోటీసులు జారీ చేశారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విషయం తెలుసుకుని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులతో కలసి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ నర్సింగ్‌రావు, ఎస్సైలు సురేశ్, ప్రేమ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ, టీఎస్ బీపాస్ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘిస్తూ అదనపు అంతస్తులను నిర్మిస్తున్న యజమానికి ఈనెల 3న కూకట్పల్లి సర్కిల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యజమానులతో పాటు సంబంధిత ఇంజినీర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు కూకట్పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు.