మేడ్చల్, జూన్ 18 : మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మురహరిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో రాజీవ్ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు, డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. భార్యాభర్తలతో పాటు మరో చిన్నారి మృతి చెందగా, వారి కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజ్గిరి ప్రాంతంలో నివాసం ఉండే చంద్రశేఖర్ రైల్వే శాఖ లో విధులు నిర్వహిస్తున్నాడు.
బుధవారం గోదావరిఖనిలో ఉన్న తన అత్తాగారింటి నుంచి చంద్రశేఖర్ బుధవారం బయల్దేరాడు. ఒక కారులో చంద్రశేఖర్, ఆయన భార్య రేఖ, కుమారుడు లోహి త్, రేఖ సోదరి కుమారుడు నిహాల్లతో కలిసి బయల్దేరగా మరో కారులో రేఖ సోదరుడు జనగాం రాజశేఖర్ తన కుటు ంబ సభ్యులతో బయల్దేరాడు. మార్గమధ్యంలో కొండగట్టుకు వెళ్లి, ఆంజనేయస్వామిని ఇరు కుటుంబాల వారు దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రాత్రి నగరానికి పయనం అయ్యారు. కరీంనగర్-హైదరాబాద్ రాజీవ్ రహదారి ఉన్న మురహరిపల్లి వద్దకు రాగానే చంద్రశేఖర్ నడుపుతున్న కారు డివైడర్‌ను దాటి, కుడి పక్కకు వెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది.
చంద్రశేఖర్ ఏమి జరుగుతుందో గుర్తించే లోపే లిప్త కాలంలో లారీని వేగంగా ఢీ కొట్టడంతో కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న భార్య రేఖ, కుమారుడు లోహిత్, రేఖ అక్క కుమారుడు నిహాల్ తీవ్రంగా గాయపడ్డారు. వారి వెనుకగా మరో కారులో వస్తున్న రేఖ సోదరుడు రాజశేఖర్, మృతి చెందిన చంద్రశేఖర్‌తో పా టు గాయపడిన వారిని రాజీవ్ రహదారి పక్కన లక్ష్మిక్కపల్లిలో ఉన్న ఆర్వీఎం ఆస్పత్రికి 108 అంబులెన్స్‌లో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేఖ, నిహాల్ మృతి చెందారు. లోహిత్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ సందర్శించి, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆర్వీఎం నుంచి గాంధీకి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు.