బోడుప్పల్, జనవరి 8 : సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్(Cherlapalli Railway Terminal) వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు(Rtc bus) నడుపుతున్నట్లు ఆర్టీసీ చెంగిచెర్ల డిపో మేనేజర్ కే కవిత తెలిపారు. ఆర్టీసీ చెంగిచెర్ల డిపోలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. నూతనంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం అయినందున రైల్వే ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రతి నిత్యం 10 నిమిషాలకు ఒక్క బస్సు నడుపుతున్నామన్నారు.
రూట్ నెంబర్ 250సీ సికింద్రాబాద్ బ్లూసీ పాయింట్ నుంచి ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు వయా హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, హెచ్‌పీసీఎల్ మీదుగా ప్లాట్ ఫాం నెంబర్ 1 చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు, అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు బస్సు సౌకర్యం ఉందని చెప్పారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి చెంగిచెర్ల, ఉప్పల్, రామంతాపూర్ మీదుగా బోరబండకు ప్రతి రోజు 40 నిమిషాలకు ఒక బస్సు కొత్తగా ప్రారంభించినట్లు చెప్పారు.
సంక్రాంతి పర్వదినం సందర్భంగా అదనంగా నడిపే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల రవాణా సౌకర్యార్థం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం, రాత్రి వేళలో ఉప్పల్ నుంచి ప్లాట్ ఫాం నెంబర్ 9 చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు అదనంగా బస్సులు నడుపుతున్నట్లు ఆమె చెప్పారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు.