సిటీబ్యూరో/దుండిగల్, అక్టోబర్ 08 (నమస్తే తెలంగాణ): గతేడాది సెప్టెంబర్ 8వ తేదీన హైడ్రా బుల్డోజర్లు దుండిగల్‌లోని మల్లంపేట కత్వాచెరువులో నిర్మాణాలు చేశారంటూ 13విల్లాలను నేలమట్టం చేశాయి. రూ.కోట్లు పెట్టి కొన్న విల్లాలు కళ్లముందే కూలిపోతుంటే ఆ యజమానులు గుండెలవిసేలా రోదించారు. లేక్‌వ్యూ పేరుతో బిల్డర్ చేసిన పనులకు తాము బలైపోవాలా అంటూ హైడ్రాను ప్రశ్నించారు. నాటి నుంచి నేటివరకూ తమది కాని ఇంటికి కూడా ఈఎంఐలు కడుతూనే ఉన్నారు. విల్లాలు కూల్చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తమ ఖాతాలో మరో విజయం పడిందంటూ కూల్చివేతలపై ప్రకటించుకున్నారు.
సరిగ్గా సంవత్సరం గడిచింది. సెప్టెంబర్ 2025లో మళ్లీ అదే ప్రాంతంలో కత్వచెరువు కనిపిస్తున్న చోటే అధికార పార్టీ నేతల అండదండలతో ఓ బిల్డర్ ఆధ్వర్యంలో కొత్త నిర్మాణాలు మొదలయ్యాయి. కత్వాచెరువు హద్దుల్లోనే పిల్లర్లు వేసి ప్రహరీ కూడా కడుతున్నారు. అక్కడ కట్టొద్దంటూ మున్సిపల్ శాఖ నుంచి నోటీసులు వచ్చినా పట్టించుకోవడం లేదు. అయినా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులెవరూ ఈ కొత్త నిర్మాణాల వైపు కన్నెత్తికూడా చూడడంలేదు.
అయితే హైడ్రా ఎందుకు ఊరుకుంటోందో అర్థం కావడం లేదు. సామాన్యుడిపై బుల్డోజర్ ప్రతాపం కనబరిచి వారి బతుకులు ఛిన్నాభిన్నం చేసిన హైడ్రాకు కొత్తగా కడుతున్న ఈ నిర్మాణాలు కనిపించడం లేదా.. చెరువులోనే కడుతున్నట్లుగా సాక్ష్యాధారాలున్నప్పటికీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వీటిపై ఎందుకు మౌనం వహిస్తున్నారు. అధికార పార్టీనేతల అండదండలు ఉండడమే కారణమా? అని స్థానికులు ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు.
బిల్డర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు మరో బిల్డర్ తనకున్న అధికారపార్టీ అండదండలతో నిర్మాణాలు చేపట్టి మళ్లీ అమాయకులను బలిచేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. గతేడాది కొత్తగా ఏర్పాటైన ఉత్సాహంతో దూకుడుగా విల్లాలను కూల్చేసిన హైడ్రా ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటూ బిల్డర్ నిర్మాణాలను పట్టించుకోవడం లేదు. తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో మళ్లీ కొత్త నిర్మాణాలు వెలుస్తుంటే హైడ్రాకు కనిపించడం లేదా.. లేక అధికారపార్టీ నేతలున్నారన్న స్వామిభక్తితో ఆ దిశగా కాలు కదపడం లేదా.. కత్వాచెరువు విషయంలో హైడ్రాకు స్థానికులు సంధిస్తున్న ప్రశ్నాస్ర్తాలివి.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మ-దుండిగల్ మండలం మల్లంపేట్‌లోని కత్వాచెరువు వద్ద అక్రమనిర్మాణాలు మళ్లీ మొదలయ్యాయి. గతేడాది హైడ్రా కూల్చివేతల్లో కత్వా చెరువు హద్దుల్లో నిర్మాణాలు జరిగాయంటూ విల్లాలను కూల్చేశారు. ఆ తర్వాత విల్లాలతో పాటు అక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ తాజాగా మరో నిర్మాణ సంస్థ కత్వా చెరువు ఒడ్డునే నిర్మాణాలు చేపట్టింది. అప్పట్లో తాము తీసుకున్న బ్యాంక్ రుణాలు లేని ఇంటికి ఎలా కట్టాలని బాధితులు అడిగితే, అది మీకు అమ్మిన వారిని, బ్యాంకు వారిని అడగండని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పినట్లు బాధితులు చెప్పారు. స్పష్టంగా చెరువుల కబ్జాలను అరికట్టడమే తమ లక్ష్యమంటున్న హైడ్రాకు మరీ కత్వా చెరువులో ఈ నిర్మాణాలు కనిపించడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
అధికారపార్టీ నేతల అండదండలతోనే..
మల్లంపేట్‌లోని సర్వేనెంబర్ 170/3, 170/4, 170/5లలో శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరిట గుర్రం విజయలక్ష్మి అనే మహిళ 19.5 ఎకరాల్లో తప్పుడు అనుమతులతో సుమారు 325 విల్లాలను నిర్మించి, పలువురికి విక్రయించి సొమ్ముచేసుకుంది. ఇందులో కొన్ని విల్లాలు కత్వచెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లల్లోకి వస్తున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైడ్రా గత ఏడాది 13విల్లాలను నేలమట్టం చేసింది. ఈ క్రమంలో కొంతకాలం పాటు ఇక్కడ స్తబ్ధత నెలకొనగా ఇటీవల కొందరు వ్యక్తులు చెరువు ఎఫ్టీఎల్ బఫర్జోన్లలో పిల్లర్లు వేసి ప్రహరీలు కట్టి మరీ కొత్త నిర్మాణాలకు తెరలేపారు.
శ్రీ వినాయక రియల్టర్ అండ్ డెవలపర్స్ పేరుతో సదరు స్థలంలో టీఎస్‌బీపాస్ కింద ఒక విల్లా నిర్మాణానికి అనుమతులు పొంది, ఏకంగా ఆరు నిర్మాణాలు చేపతుండటంతో స్థానికులు అటు రెవెన్యూ, ఇటు మున్సిపాలటీ అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో తప్పుడు సమాచారంతో బిల్డర్ అనుమతులు పొందాడని, పర్మిషన్లు వెనక్కు తీసుకుంటున్నామని దుండిగల్ మున్సిపల్ అధికారులు సదరు బిల్డర్‌కు ఆయన తరపువారికి నోటీసులు ఇచ్చారు. అయినా జేసీబీలు పెట్టి తవ్వడంతో పాటు అక్కడ ప్రహరీ నిర్మించి పిల్లర్లు వేసి మిగతా పనులు చేసుకుంటున్నారు.
ఈ విషయంలో మున్సిపల్ అధికారులకు మరోసారి ఫిర్యాదు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని, గతంలో దీని పక్కనే చెరువు హద్దులంటూ విల్లాలు కూల్చేసి హంగామా చేసిన హైడ్రా ఈ కొత్త నిర్మాణాలపై నోరు మెదపడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అయితే ఈ నిర్మాణాలను చేపట్టడంలో మల్లంపేట్‌కు చెందిన బిల్డర్‌కు అధికారపార్టీకి చెందిన ముఖ్యనేతలు కొందరు సహకరిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల మల్లంపేట్‌లోని అమ్మవారి గుడి సమీపంలోనూ ఓ వ్యక్తి సర్వేనంబర్ 170ని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నా అధికారులు కళ్లు మూసుకున్నారని పలువురు మండిపడుతున్నారు. కత్వాచెరువు ఆక్రమణలపై గండిమైసమ్మ-దుండిగల్ తహశీల్దార్ మతిన్‌ను ఫోన్లో వివరణ కోరేందుకు యత్నించగా ఆయన స్పందించలేదు. మరోవైపు హైడ్రా కూడా ఈ వ్యవహారం తెలిసినప్పటికీ పెద్దగా పట్టించుకోకుండా ఉందని స్థానికులు అంటున్నారు.