బన్సీలాల్‌పేట్, జనవరి 21 : గాంధీ దవాఖానలో అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యువతి(25) కొంతకాలంగా గుండె దడ, శ్వాస ఆడకపోవడం సమస్యలతో బాధపడుతున్నది. వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు వెళ్లగా, వారు గాంధీ దవాఖానకు సిఫారసు చేశారు. గాంధీలో రోగికి అరుదైన బార్బెట్ బీల్ సిండ్రోమ్, పాలి డాక్టిలీ, రెడ్ కోన్ డిస్ట్రోఫి వంటి జన్యుపరమైన గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని గుర్తించారు. గుండె ఊపిరితిత్తుల సర్జరీ విభాగం హెచ్ఓడీ ప్రొఫెసర్ రవీంద్ర ఆధ్వర్యంలో వైద్యులు క్లిష్టమైన సర్జరీని అధునాతన పద్ధతిలో విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. వాణి తెలిపారు.