వెంగళరావునగర్ , ఫిబ్రవరి 25 : పన్నెండ్ల బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. స్నేహితురాలి కుమార్తె అన్న సోయి కూడా లేకుండా ఆమె బట్టలిప్పి ప్రైవేటు భాగాలను తాకుతూ అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. ఈ దుశ్చర్య తర్వాత బాలిక ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన తల్లి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వనపర్తిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తిలో ఉండే భార్యాభర్తలకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె (12) ఏడో తరగతి చదువుతోంది. బాలిక తండ్రితో ప్రశాంత్ (30) అనే వ్యక్తికి పరిచయం ఉంది. ఆ స్నేహంతోనే తరచూ ఇంటికి వచ్చే వెళ్లేవాడు. ఈ క్రమంలోనే గత ఏడాది జూన్‌లో వాళ్ల ఇంటికి వెళ్లిన ప్రశాంత్.. బాలిక ఒంటరిగా ఉండటం చూసి ఆమెపై అఘాయిత్యానికి యత్నించారు. బాలికను వివస్త్రను చేసి ఆమె ప్రైవేటు పార్ట్స్‌ను తాకుతూ పైశాచిక ఆనందం పొందాడు. అనంతరం ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు.
ప్రశాంత్ చేష్టలతో భయపడిన బాధిత బాలిక డిప్రెషన్లోకి వెళ్లిపోయి ఎవరితో మాట్లాడకుండా ఉండిపోసాగింది. కుమార్తె ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన తల్లి ఏమైందని నిలదీసింది. దీంతో తనకు జరిగిన ఘోరమంతా చెప్పి భోరమంది. బిడ్డపై జరిగిన అకృత్యం తెలుసుకున్న ఆ తల్లి గుండె తల్లడిల్లింది. వెంటనే ఈ విషయం భర్తకు చెప్పగా.. కనుక్కుంటానులే అని అతను తేలిగ్గా తీసుకున్నాడు. రోజులు గడిచినా అతను పట్టించుకోకపోవడంతో.. డైరెక్ట్‌గా ఆమెనే భర్త స్నేహితుడిని నిలదీసింది. నా బిడ్డపై ఇంతటి దారుణానికి పాల్పడతావా అని ప్రశ్నించింది. దీనికి తెగించిన స్నేహితుడు ఏం చేసుకుంటావో చేసుకోపో అని జవాబిచ్చాడు. దీంతో బాధితురాలి తల్లి వనపర్తి నుంచి హైదరాబాద్ రహ్మత్‌నగర్‌లోని తన పుట్టింటికి వచ్చింది. మధురా నగర్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టం కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కేసును తదుపరి దర్యాప్తు కోసం వనపర్తికి బదిలీ చేశారు.