Gachibowli | శేరిలింగంపల్లి, మార్చి 20: అనుమనాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంభ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… మసీద్‌బండ కొండాపూర్ అంబేద్కర్ నగర్ ప్రాంతానికి చెందిన పెండ్యాల రాజు(35) కూలీ పని చేసుకుని జీవిస్తున్నాడు. భార్య లావని, ఇద్దరు కుమారులు సంతానం. గత కొంతకాలంగా రాజు మద్యానికి బానిసై కూలీ పనులకు సైతం వెళ్లకుండా ఇంటి దగ్గర ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం భార్య లావని ఇద్దరు కుమారులను తీసుకొని పటాన్చెరు చిట్కూల్‌లోని పుట్టింటికి వెళ్ళింది.
కాగా ఇంటి వద్ద ఒక్కడే ఉన్న రాజును గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై తీసుకొని వచ్చి బుధవారం రాత్రి ఇంటి దగ్గర అరుగుపై కూర్చోబెట్టి వెళ్ళాడు. తెల్లవారుజామున విగతజీవిగా పడిఉన్న రాజును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. మృతుడు రాజు మేనల్లుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రాజు సహజంగా చనిపోయాడా లేక ఎవరైనా గాయపరిచారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజు ఒంటిపై స్వల్ప గాయాలు ఉన్నాయని ఎక్కడైనా పడి గాయాలు అయ్యాయా లేక ఎవరైనా హత్య చేశారా అనే విషయాలు విచారణలో తేలాల్సిఉంది.