Hyderabad | మన్సురాబాద్, ఏప్రిల్ 25: పుట్టినరోజు సందర్భంగా కత్తితో హంగామా చేసిన వ్యక్తిని నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నాగోల్, బండ్లగూడ, కృషినగర్ కాలనీకి చెందిన రాసునూరి అఖిల్ (24) వృత్తిరీత్యా కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల అఖిల్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా పెద్ద కత్తితో కేకును కట్ చేసి సదర్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కత్తితో ప్రజలను భయభ్రాంతులను గురి చేసే విధంగా వ్యవహరించడంతో అఖిల్‌పై నాగోల్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుల మీదకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అఖిల్ ఇంట్లో సోదా చేయగా పొడవైన పెద్ద కత్తి లభించింది. అఖిల్‌పై ఆర్మ్స్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.